Showing posts with label Andhra Pradesh. Show all posts
Showing posts with label Andhra Pradesh. Show all posts

అహోబిలం -- స్వామివారి ‘పెళ్లి పిలుపు!’

స్వామివారి ‘పెళ్లి పిలుపు!’


లోకకల్యాణ కారకుడే, తన కల్యాణానికి రమ్మని పిలుస్తాడు. సాక్షాత్తూ... లక్ష్మీపతే భక్తుల కానుకల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. ఆహా... అహోబిలం పరిసరాల్లోని ఆ ముప్ఫై అయిదు గ్రామాల ప్రజలు ఎంత అదృష్టవంతులు!

పండగంటే ఒకరోజు, మహా అయితే మూడురోజులు. అహోబిలం పరిసరాల్లోని ముప్ఫై అయిదు గ్రామాల్లో మాత్రం... ఆ ఉత్సవాన్ని నలభై అయిదు రోజులు జరుపుకుంటారు. ఆ ఒకటిన్నర నెలా... ప్రతి ఇంట్లోనూ సందడే. ఆడపడుచులూ బంధుమిత్రులతో వూళ్లన్నీ కళకళలాడుతుంటాయి. ఎటు చూసినా బొమ్మల దుకాణాలూ గాజులూ చిరుతిళ్ల అంగళ్లే! కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువయ్యాడు. ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రమిది. సింహరూపుడైన శ్రీహరి హిరణ్యకశిపుడిని సంహరించిన చోటు ఇదేనంటారు. బ్రహ్మోత్సవాలకు ముందు ఉత్సవర్లు జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదుడు పారువేటోత్సవాలకు సిద్ధమవుతారు.

ఉత్సవ చరిత్ర

‘పరి’ అంటే గుర్రం. స్వామివారు క్రూరమృగాల్ని వేటాడేందుకు గుర్రంపై బయలుదేరడాన్నే పారువేట అంటారు. ప్రతీకాత్మకంగా... దుష్టశిక్షణకూ శిష్టరక్షణకూ దేవదేవుడు సాగించే పర్యటన అనుకోవచ్చు. ‘గ్రామ గ్రామానికీ నన్ను తీసుకెళ్లండి. నా పాదపద్మాల్ని ఆశ్రయించే అవకాశాన్ని భక్తులకు ఇవ్వండి’ అని స్వామి ప్రథమ పీఠాధిపతికి చెప్పినట్టు అహోబిల క్షేత్ర మహత్యంలో పేర్కొన్నారు. నా పెళ్లికి నేనే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని కూడా అన్నారట. ఆరువందల సంవత్సరాల క్రితం, ప్రథమ పీఠాధిపతి శఠగోప యతీంద్ర మహాదేశికన్‌ స్వాముల వారు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. నాటి నుంచీ నేటి వరకూ పార్వేటోత్సవాలు 45 రోజుల పాటూ 35 గ్రామాల్లో నిర్విఘ్నంగా సాగుతాయి. ఆతర్వాత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గరుడోత్సవంతో (మార్చి 17) వేడుకలు పూర్తవుతాయి.

స్థానిక ఐతిహ్యం...

హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరహరి... వీరావేశంతో నల్లమల అడవుల్లో సంచరిస్తుంటాడు. స్వామివారి ఉగ్రత్వం ఎంతకూ తగ్గదు. ఆ సమయంలో చెంచులక్ష్మి కనిపిస్తుంది. ప్రహ్లాదవరదుడు ఆమెను చూసి శాంతిస్తాడు, మనువాడాలని నిర్ణయిస్తాడు. అయితే చెంచులు, స్వామికి తమ ఆడపడుచును ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు. పెళ్లి కూతురికి ఓలి (కట్నంగా) ఏమిస్తావని అడిగారు. ‘పారువేటోత్సవాల్లో భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను’ అని స్వామి మాటిచ్చాడు. అలా, తన వివాహ మహోత్సవానికి సమస్త భక్తజనులనూ ఆహ్వానించేందుకు అహోబిలం పరిసరాల్లోని 35 గ్రామాల్లో సంచరిస్తాడు నరసింహుడు.

పారువేటోత్సవాలు...

స్వామి పారువేటోత్సవాలకు వచ్చే ప్రతి గ్రామంలో ‘తెలుపు’లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. తెలుపు అంటే ‘తెలుపు.. ఎరుపు’ రంగులతో అలంకరించిన వేదిక. తెలుపు మంచి మనసును సూచిస్తుంది. ఇక్కడే స్వామి కొలువుదీరి పూజలందుకుంటాడు. ప్రతి గ్రామంలోనూ తెలుపులను సిద్ధం చేసే బాధ్యత వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలకు దక్కుతోంది. పల్లకీ మోసే బాధ్యత కూడా వారసత్వమే. తరాల నుంచీ ఆ కుటుంబాలవారే మోస్తున్నారు. వీరిని బోయీలంటారు. రుద్రవరం మండలం ఆలుమూరు, టి.లింగందిన్నెలకు చెందిన సుమారు 120 మంది నరసింహుని సేవలో తరిస్తున్నారు. స్వామి ఎగువ అహోబిలం నుంచి కిందికి వచ్చినప్పటి నుంచీ మళ్లీ కొండపైకి వెళ్లేంత వరకూ..ఆ ఆశ్రిత రక్షకుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ప్రతాపరుద్రుడి కాలం నుంచీ వీరి కుటుంబాలు ఆ బాధ్యత మోస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతటి ఉన్నత విద్యావంతులైనా, ఎంత ఉన్నతోద్యోగులైనా స్వామి పల్లకీని ఒక్కరోజైనా మోయాలని పోటీపడతారు.

దర్శన భాగ్యం ఇలా...

పారువేటోత్సవాల్లో భాగంగా స్వామి పల్లకి ఎగువ అహోబిలం నుంచి కిందికి దిగుతుంది. బాచేపల్లిలో ప్రారంభమై రుద్రవరం గ్రామానికి చేరడంతో

ఉత్సవతంతు ముగుస్తుంది. ఆ 45 రోజులూ ప్రతి గ్రామంలోనూ పండుగే. స్వామి తమ వూరికి వచ్చాడంటే ప్రజలకు పట్టరాని ఆనందం. వ్యాపారులు వివిధ దుకాణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క ఆళ్లగడ్డలోనే వేయి దుకాణాలు వెలుస్తాయి. రోజూ కనీసం రూ.25 లక్షల వ్యాపారం జరుగుతుంది. వారంలో దాదాపు రూ.2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ‘ఆరువందల ఏళ్లుగా... ఎలాంటి ఆటంకాలూ లేకుండా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇదంతా స్వామి మహిమే’ అంటారు ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్‌. అహోబిలం.. నంద్యాల నుంచి అరవై కిలోమీటర్లూ, కర్నూలు నుంచి దాదాపు నూటనలభై కిలోమీటర్లు.

నిటలాక్షుని వైభవం -- ద్రాక్షారామం

నిటలాక్షుని వైభవం -- ద్రాక్షారామం



‘నమశ్శివాయ’ అన్న పంచాక్షరీ మంత్రాన్ని రుద్ర నమకానికి హృదయక్షేత్రంగా భావించే ధార్మికులు - మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా భావిస్తారు. భక్తితో శివలింగాన్ని అభిషేకిస్తారు. ముఖ్యంగా త్రిలింగ భూమిగా పేరొందిన తెలుగునాట శివరాత్రి వైభవం మిన్నంటుతుంది. పంచారామాల్లో ఒకటిగా ప్రణతులందుకొనే ద్రాక్షారామంలో భీమేశ్వర మూర్తి భక్తులను నిరంతరం ఆశీర్వదిస్తుంటాడు. తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన వెలసిన భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి.

‘కాశ్యాం తు మరణాన్ముక్తిః
జీవనం మరణం వాపి
శ్రేయో భీమేశ్వరపట్టణే..’

  భీమేశ్వరుడు నిండుగా కొలువుదీరిన ద్రాక్షారామ ప్రాశస్త్యాన్ని తెలిపే ఈ శ్లోకానికి ‘కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. భీమేశ్వరుడిని పూజిస్తే, కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యం, కైవల్యం రెండూ లభిస్తాయి’ అని అర్థం. దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రరాజం పౌరాణిక గాథల్లో అభివర్ణితమైంది. పంచారామాల్లో ఒకటిగా భక్తకోటి పూజలందుకుంటోంది.

తెలుగుసీమ పంచారామాలకు ప్రసిద్ధి చెందింది. త్రిపురాసురుణ్ణి పాశుపతాస్త్రంతో అంతమొందించిన పరమేశ్వరుడు, ఆ అసురుడు అర్పించే శివలింగాన్ని అయిదు ఖండాలు చేయగా- అవి ప్రతిష్ఠితమైన ప్రాంతాలేపంచారామాలని ఓ ఐతిహ్యం ఉంది. ఆ లింగ శకలాలు పాలకొల్లులో క్షీరారామేశ్వరుడిగా, సామర్లకోటలో కొమరారామ మూర్తిగా, అమరావతిలో అమరేశ్వరుడిగా, భీమవరం, ద్రాక్షారామ క్షేత్రాల్లో భీమేశ్వరుడుగా పూజలందుకొంటున్నాయి.

దక్షిణ కాశి!


ద్రాక్షారామం దక్షవాటికగా పౌరాణిక ప్రాశస్త్యాన్ని పొందింది. పంచారామాల్లోని ఇతర క్షేత్రాల్లో లేని విశేషాలు ద్రాక్షారామానికి ఉన్నాయి. త్రిలింగ క్షేత్రాల్లోనూ, అష్టాదశ శక్తిపీఠాల్లోనూ ఈ భీమేశ్వర పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి సప్తగోదావరి పుష్కరిణిలో స్నానం చేసి, మాణిక్యాంబ సమేతుడైన భీమేశ్వరస్వామిని దర్శిస్తే, సాంబశివుడు సర్వపాపాల్నీ హరింపజేస్తాడని భక్తుల విశ్వాసం. కారుణ్య మూర్తి అయిన కనకసభాపతి కామితార్థాలను అనుగ్రహిస్తాడని ధార్మికుల నమ్మకం. భీమేశ్వరుడులాంటి దైవం, దక్షవాటిక అయిన ద్రాక్షారామం లాంటి ధామం, సప్తగోదావరిని పోలిన తీర్థరాజం.. జగత్తులో లేవని స్కాందపురాణం చెప్తోంది.

పురాణ గాథల్లో...


దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి దక్షారామం అని పేరు వచ్చిందని ప్రతీతి. దక్షారామం కాలగమనంలో ‘దాక్షారామం’, ‘ద్రాక్షారామం’ అని పేర్లను సంతరించుకొంది. ఈ క్షేత్రం స్థల పురాణందక్షయజ్ఞ గాథతో ముడిపడి ఉంది. సతీదేవి తండ్రి దక్షప్రజాపతి ఒక బృహత్‌ యజ్ఞాన్ని తలపెట్టి, తన అల్లుడైన శివుణ్ణి తప్ప అందరు దేవతల్నీ ఆహ్వానించాడు. తండ్రి నిర్వహిస్తున్న యాగాన్ని చూడాలన్న కుతూహలంతో సతీదేవి దక్షవాటికకు వెళదాం రండి అని శివుణ్ణి అడుగుతుంది. పిలవని పేరంటానికి వెళ్లడం తనకిష్టం లేదని కైలాసపతి తిరస్కరిస్తాడు. భర్త తోడు రాకపోయినా ఒంటరిగానే వెళ్లేందుకు సతీదేవి నిశ్చయించుకొంటుంది. తల్లితండ్రులు తనను ఆదరిస్తారనీ, అక్కున చేర్చుకుంటారనీ భావించిన సతీదేవికి దక్షవాటికలో ఆశాభంగం అవుతుంది. తోబుట్టువుల మధ్య తలెత్తుకు తిరగలేక, శివుడికి తన ముఖాన్ని చూపించలేక దాక్షాయణి కాలి బొటన వేలితో నేలపై రాసి నిప్పు రవ్వలు సృష్టిస్తుంది. అన్యమార్గం కానరాక ఆత్మాహుతి చేసుకొంటుంది. సతీ వియోగాన్ని భరించలేని భూతనాథుడు, జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి, దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేయమని ఆజ్ఞాపిస్తాడు. భస్మీపటలం అయిన దక్షవాటికలోని సతీదేవి సూక్ష్మశరీరాన్ని భుజస్కందాలపై ధరించి-నటరాజు లయ తాండవం చేస్తాడు. ఆ ప్రళయహేలకు అడ్డుకట్టలు వేసేందుకు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి సూక్ష్మశరీరాన్ని పద్దెనిమిది ఖండాలు చేస్తాడు. అవి భూమిపై పడిన ప్రాంతాల్లో అష్టాదశ శక్తి పీఠాలు ఆవిర్భావించాయనీ, సనాతన ధర్మ పూర్వవైభవ పునరుద్ధరణ కోసం భరతఖండ ఆద్యంతం పర్యటించిన ఆదిశంకరులు వీటిలో అర్చనాదుల్ని వ్యవస్థీకృతం చేశారనీ అంటారు. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకొన్న చోట పరమేశ్వరుడు భీమరూపంలో స్వయంభువుడయ్యాడని ద్రాక్షారామ స్థలపురాణం చెబుతోంది. తొలుత ఈ లింగాన్ని కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు అర్చించాడని పురాణోక్తి.

అంతర్వాహిని


స్వయంభువుడైన భీమేశ్వరుణ్ణి అర్చించేందుకు సప్తరుషులు ఇక్కడికి గోదావరిని తీసుకువచ్చారని అంటారు. దీనికి సంబంధించిన ఓ ప్రసిద్ధ గాథ ప్రాచుర్యంలో ఉంది. ద్రాక్షారామానికి పది కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తోన్న గోదావరి జలాలతో భీమేశ్వరుడికి అభిషేకం చేయాలని సప్తర్షులు తలపోశారు. అందుకు వీలుగా గోదావరిని తమ వెంట తరలించాలని భావించారు. అయితే పరవళ్లుతొక్కే గోదావరీ జలాలు తన యజ్ఞానికి భంగం కలిగిస్తాయని భావించిన తుల్యుడనే మునీశ్వరుడు, సప్తర్షులను నిలువరిస్తాడు. అది ఘర్షణకు దారితీసే సమయంలో వేదవ్యాసుడు వారి తగవును పరిష్కరిస్తాడు. గోదావరి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ద్రాక్షారామానికి చేరుకొంటుందనీ, అక్కడ సప్త గోదావరి పేరుతో పుష్కరిణిగా అవతరిస్తుందనీ తెలియజేస్తాడు. సప్తర్షులు భీమేశ్వరుడి సన్నిధికి చేరుకొనే వేళకు, సప్తగోదావరి జలాలతో సూర్యుడు తొలి అభిషేకాన్ని పూర్తిచేశాడనీ, ఆ విధంగా స్వయంభువును మొదటిసారిగా అర్చించిన ఖ్యాతి ఆదిత్యుడి సొంతమైందనీ క్షేత్రగాథ చెప్తోంది.

హరిహర మైత్రీ క్షేతం

ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి లక్ష్మీనారాయణుడు క్షేత్ర పాలకుడు కావడం విశేషం. హరిహరులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరనీ, ఇరువురికీ పూజాదికాలు సరిసమానంగా అర్పించాలనీ ద్రాక్షారామంలోని కల్యాణోత్సవాలు చెప్పక చెబుతాయి. అర్ధశరీరాన్ని సతికి అనుగ్రహించిన మాణిక్యాంబా సమేత భీమేశ్వరుడికీ, హృదయేశ్వరిని వక్షస్థలం మీద ధరించిన లక్ష్మీనారాయణుడికీ ఏటా మాఘశుద్ధ ఏకాదశి రోజున వేదికపై కల్యాణాలు నిర్వహించే దృశ్యాన్ని ద్రాక్షారామంలో మాత్రమే దర్శించగలం. శైవులకూ, వైష్ణవులకూ ఇవి నేత్రపర్వం చేస్తాయి. ఆలయ ప్రాకారం చుట్టూ కాలభైరవుడు, ఢుండి గణపతి, విరూపాక్షుడు, నటరాజు, సప్తమాతృకలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, చతుర్మఖ బ్రహ్మ, లక్ష్మీ గణపతి, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, వీరభద్రుడు, సురేశ్వర చండీశ్వరాది దేవీదేవతామూర్తులూ కొలువుదీరి ఉంటారు.

అనుపమాన నిర్మాణశైలి!

ద్రాక్షారామ భీమేశ్వరాలయం- నాలుగువైపులా నాలుగు ఎత్తయిన రాజగోపురాలతో, పన్నెండు ఎకరాలకుపై బడిన విస్తీర్ణంలో నెలకొని ఉంది. ఆలయానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ధ్వజస్తంభం డెబ్భై అడుగుల పొడుగున దర్శనమిస్తుంది. ఎత్తయిన రాతిగోడలతో నిర్మించిన సుదీర్ఘ ప్రాకారాల మధ్య మాణిక్యాంబతో కొలువుదీరిన భీమేశ్వరుడి దివ్యసన్నిధి కైలాస సభావేదికను తలపిస్తుంది. భీమేశ్వరుణ్ణి దర్శించేందుకు భక్తులు మొత్తం అయిదు ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది. బయటి ప్రహరీ నుంచి వెళ్తే, ఇంకో ప్రాకారం వస్తుంది. దాని మధ్య ప్రధానాలయం రెండు అంతస్థులుగా ఉంటుంది. రెండో ప్రాకారం నుంచి గర్భాలయానికి వెళ్లడానికి మెట్లుంటాయి. సుమారు ఇరవై అడుగుల ఎత్తుండే పై అంతస్థులో మళ్లీ మూడు ప్రాకారాలు ఉంటాయి. వీటిని ప్రదక్షిణ చేస్తూ గర్భాలంయంలోకి ప్రవేశించవచ్చు. ఈ ప్రదక్షిణ మార్గాన్నే ‘చీకటి కోణం’ అంటారు. విద్యుచ్ఛక్తి లేని రోజుల్లో ఈ ప్రాకారాలు కటిక చీకటితో నిండి ఉండేవి. అందువల్ల వీటిలోని మొదటి రెండు ప్రాకారాల గోడలపై రాతి బొడిపెలు కనిపిస్తాయి. మునుపు ఈ బొడిపెల్లో నవరత్నాలు పొదిగారనీ, అవి భక్తులకు వెలుగులు అందించేవనీ అంటారు. చివరిగా అయిదో ప్రాకారంలో స్ఫటిక లింగ రూపంలో భీమేశ్వరుడు భక్తులకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. దిగువ అంతస్థులోని అట్టడుగు పీఠం నుంచి భీమేశ్వర లింగం, సుమారు నలభై అడుగుల పొడవు ఉంటుంది. ప్రధాన ఆలయానికి తూర్పున అశ్వత్థనారాయణ వృక్షం ఉంది. సంతానం లేనివారు, లౌకిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ వృక్షాన్ని భక్తితో కొలిస్తే సంతతి కలుగుతుందనీ, సమస్యలు పరిష్కారం అవుతాయనీ ధార్మికులు విశ్వసిస్తారు. సప్తగోదావరిగా వ్యవహరించే పవిత్ర పుష్కరిణికి వెళ్లే తోవలో సప్తర్షులు, అరుంధతీ దేవి ప్రతిమలు ఉన్నాయి. అత్రి, భృగు, కౌస్త, వశిష్ఠ, గౌతమ, కశ్యప, అంగీరస రుషులు, వశిష్ఠుడి ధర్మపత్ని అరుంధతి శిల్పాలు చిన్న చిన్న గుళ్లలో దర్శనమిస్తాయి. ప్రధాన ప్రాకారంలో అనేక మంటపాలున్నాయి. వాటిని- కొట్టార, గాంగేయరాయ, గండభేరుండదేవ, నంది, దీపావళి, నాట్య, శనివార, గయ, అర్క, తిరుచుట్టుమాలిక, మృగయా రామ మంటపాలని అంటారు.

చారిత్రక నేపథ్యం

వేంగిని రాజధానిగా చేసుకొని త్రిలింగ దేశాన్ని పాలించిన తూర్పుచాళుక్యుల కాలంలో తెలుగు సాహితీ సంస్కృతులు పరిఢవిల్లాయి. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారత కావ్యాన్ని ఆంధ్రీకరించేందుకు అంకురార్పణ జరిగింది. ఈ రాజుల ఏలుబడిలోనే క్రీస్తుశకం 1022-1061 సంవత్సరాల మధ్య వేంగి రాజ్యాన్ని ఏలిన రాజరాజ నరేంద్రుడి ఆస్థానకవి అయిన నన్నయ భట్టారకుడు భారతాంధ్రీకరణకు శ్రీకారం చుట్టాడు.
రాజరాజనరేంద్రుడికి పూర్వికుడైన చాళుక్య భీముడు క్రీస్తుశకం 892-922 సంవత్సరాల మధ్య రాజ్యాన్ని పాలిస్తున్న రోజుల్లో ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఆలయ స్తంభాలపైన, గోడల మీద మొత్తం 832 శాసనాలు చెక్కి ఉన్నాయి. క్రీస్తుశకం 11 వ శతాబ్ది నుంచి 15వ శతాబ్ది వరకూ అనేక చారిత్రక విశేషాలను ఈ శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. తూర్పు చాళుక్యులతో పాటు తూర్పు గాంగేయులు, కాకతీయులు, కొండవీటి రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు ద్రాక్షారామంలో శివార్చన కోసం భూరి విరాళాలిచ్చారు. వారు నిర్మించిన మంటపాలు, గోపురాలు, ప్రాకారాలు, కల్పించిన అనేక వసతులు ద్రాక్షారామాన్ని క్షేత్రరాజంగా తీర్చిదిద్దాయి.

అష్టోత్తర శతలింగాలు

ద్రాక్షారామంలోని స్వయంభూలింగాన్ని భక్తులు సందర్శించేందుకు వీలైన రీతిలో- రుద్రమూర్తిని శాంతపరచేందుకు ఈ క్షేత్రం చుట్టూ ఎనిమిది సోమేశ్వర ఆలయాలను చంద్రుడు నిర్మించాడని అంటారు. ద్రాక్షారామం పరిసరాల్లోని కోలంక, వెంటూరు, కోటిపల్లి, వెల్ల, దంగేరు, కోరుమిల్లి, సోమేశ్వరం, పెనుమళ్ల గ్రామాల్లో ఈ ఆలయాలు ఉన్నాయి. ప్రధానమైన భీమేశ్వర ఆలయంలోకి ప్రవేశిస్తే- రెండో ప్రాకారంలోని ‘భీమసభ’ అని వ్యవహరించే ఒక పీఠం కనిపిస్తుంది. దీనిపై నూట ఎనిమిది శివలింగాలు దర్శనిమిస్తాయి. కవి సార్వభౌముడుగా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుడు రచించిన ‘భీమ ఖండం’ కావ్యంలో ఈ అష్టోత్తర శతలింగాల ప్రస్తావన ఉందని పరిశోధకులు గుర్తించారు. జ్యోతిష ప్రాముఖ్యం ఉన్న ఈ క్షేత్రాన్ని ఒకప్పుడు భక్తులు విశేషంగా దర్శించారనీ, వృత్తాకారంలో ఉండే ఈ ప్రదేశాలన్నిటినీ కలిపి శ్రీనాథుడు ‘భీమఖండం’గా కావ్యావిష్కరణ చేశాడనీ సాహితీ విమర్శకులు పేర్కొంటారు.

ఉత్సవ వైభవాలు

ద్రాక్షారామంలో నిత్యోత్సవాల్ని నిర్వహించేందుకు వీలుగా వందల సంఖ్యలో రాజులు, జమీందారులు భూ, కనక, వస్తు, వాహన, ద్రవ్య, రూపాల్లో పెద్ద ఎత్తున విరాళాలిచ్చారు. ఉత్సవాలకు విచ్చేసే యాత్రికుల వసతుల కోసం సత్రాల్ని నిర్మించారు. ఏటా మాఘమాసంలో ఎనిమిది నుంచి పది రోజుల పాటు ఇక్కడ కల్యాణోత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంలో అంకురార్పణ, ధ్వజారోహణ, అభిషేకాదుల్ని నిర్వహిస్తారు. ఏటా మార్గశిర పౌర్ణమి రోజున, ఆరుద్ర నక్షత్రం ప్రవేశించే సందర్భంలో ఆర్ద్రోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంలో క్రతువులు నిర్వహించి హవిస్సును అర్పిస్తారు. చైత్ర పౌర్ణమి నాడు మాణిక్యాంబ, భీమేశ్వరుల్ని ప్రత్యేకంగా దవనంతో అర్చిస్తూ ఉయ్యాల్లో ­పుతూ డోలోత్సవాన్ని జరుపుతారు. అలాగే వేసవిలో స్వామిని వనవిహారానికి తీసుకు వేళ్లే ‘తోట ఉత్సవం’, ఉగాది ముందు రోజు ‘కొత్త’ అమావాస్య నాడు ‘ మాఘంత దాసోత్సవం’ ద్రాక్షారామంలో ఏటా నిర్వహిస్తారు. వీటితో పాటు చైత్రమాసంలో ‘గౌరీ వ్రతం’, వైశాఖ మాసంలో ‘అక్షయ తృతీయ చందనోత్సవం’ ప్రసిద్ధి చెందినవి.

ఏడాది పొడవునా వేడుకలతో అలరారే ద్రాక్షారామానికి చేరుకోవడానికి రాజమండ్రి, కాకినాడల నుంచి ప్రతి అరగంటకూ బస్సులున్నాయి. స్వయంభువుడైన సాంబశివుణ్ణి భీమేశ్వర లింగ రూపంలో దర్శిస్తూ - ‘నమఃపార్వతీపతయే హరహరమహాదేవ’ అని భక్తి ప్రపత్తులతో ఎలుగెత్తి ఘోషించే ధార్మికులకు ద్రాక్షారామం అవశ్య దర్శనీయం.

ఎలా చేరుకోవాలి

* కాకినాడకు 28 కి.మీ. దూరంలో ఉంది.
* రాజమండ్రికి 50 కి.మీ. దూరంలో, అమలాపురానికి 25 కి.మీ.దూరంలో ఉంది.
* రైలు ద్వారా రాజమండ్రి, కాకినాడ చేరుకొని అక్కడి నుంచి ఇతర వాహనాలలో ఈ క్షేత్రానికి వెళ్లొచ్చు.
* దేశంలోని ప్రధాన పట్టణాలతో రహదారి సౌకర్యముంది.
* బస్సు సర్వీసులు ఉన్నాయి.

శ్రీకోదండరామాలయం- ఒంటిమిట్ట


శ్రీకోదండరామాలయం- ఒంటిమిట్ట



శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతంగా వెలసిన క్షేత్రమే కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం.త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ పురుషోత్తముడే ఇక్కడ నడిచినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగంలో స్వామివారు శ్రీకోదండరామస్వామిగా తన భక్తులకు అభయమిస్తున్నారు. శ్రీరామునికి అనుంగు భక్తుడైన ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ లేకపోవడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఆంజనేయుని రాకకు ముందే ఈ క్షేత్రంలో స్వామివారు విహరించినట్టు తెలుస్తోంది.

జాంబవత స్థాపితం

వానరులలో బ్రహ్మజ్ఞాని జాంబవంతుడు. ఆయన ఎన్నో యుగాలను చూశారు. అనుభవశీలి, మేధావి, శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్న అనంతరం సీతారామ, లక్షణ విగ్రహాలను ప్రతిష్టించారు. కొద్దికాలానికి సంజీవరాయ మందిరంలో ఆంజనేయవిగ్రహాన్ని నెలకొల్పారు. కలియుగంలో ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ఒంటెడు, మిట్టడు అనే సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. వారిపేరుతోనే ఒంటిమిట్టగా ఈ గ్రామం ఖ్యాతిచెందింది. వీరి విగ్రహాలను కూడా ఆలయప్రాంగణంలో చూడవచ్చు.

అద్భుతమైన ఆలయనిర్మాణం

ఆలయ నిర్మాణం విజయనగరవాస్తుశైలిలో అద్భుతంగా నిర్మితమైవుంటుంది. మూడు గోపురాలు సుందరంగా వుంటాయి. ఆలయం లోపల స్తంభాలు, గోడలపై సజీవమైన చిత్రకళను వీక్షించవచ్చు. విఘ్నేశ్వరుడు నాట్యభంగిమలో వుండి భక్తులకు ఆశీర్వచనం ఇస్తుంటాడు. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో పర్యటించిన ఫ్రెంచ్‌ యాత్రీకుడు టావెర్నియర్‌ ఆలయ గోపురం దేశంలోని పొడవైన గోపురాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆలయాన్ని అన్నమయ్య సందర్శించి అనేక సంకీర్తనలు రచించారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతనామాత్యులు ఆ గ్రంథాన్ని ఇక్కడే స్వామివారికి అంకితమిచ్చారు. అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన రామభద్రకవి ఈ ప్రాంతానికి చెందినవాడేనని తెలుస్తోంది. ఆంధ్రవాల్మీకిగా ఖ్యాతిచెందిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట నివాసి కావడం విశేషం.

 పున్నమి వెలుగుల్లో పురుషోత్తముని కల్యాణం

చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

రాష్ట్ర ఉత్సవంగా బ్రహ్మోత్సవాలు

రాష్ట్ర విభజన అనంతరం కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించారు.

ఎలా చేరుకోవచ్చు

* కడప-తిరుపతి రహదారిపై వుంది. కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
* రైలులో రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది.
* కడప రైల్వేస్టేషన్‌లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యముంది.
* తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.

అన్నవరం సువర్ణ శోభితం... సత్యదేవుని ఆలయం

అన్నవరం సువర్ణ శోభితం... సత్యదేవుని ఆలయం



కోరిన కోర్కెలు తీర్చే భక్త వరదుడు అన్నవరం- శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి. ‘అన్న’వరాలు ఇచ్చే స్వామిగా, భక్తుల కొంగు బంగారంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ప్రసిద్ధికెక్కింది. సత్యనారాయణస్వామికి కుడిపక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని రెండు అంతస్తుల్లో దర్శించుకోవాల్సి ఉంటుంది. మొదటి అంతస్తులో స్వామివారి మూలస్తంభం. పాదాలు దర్శించుకొని.. మెట్లపైగా పైఅంతస్తుకు వెళితే శ్రీసత్యనారాయణస్వామి మహేశ్వరుడు.. అనంతలక్ష్మి అమ్మవారు ఒకే పీఠంపై కనువిందు చేస్తారు. ఇలా ఒకే పీఠంపై శివ-కేశవులు, అమ్మవారు కనిపించే ఆలయం మరెక్కడా లేదు!

ఇక్కడ రోజూ సుప్రభాత సేవ మొదలు పలు ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలకు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కొత్తగా పెళ్లైన దంపతులు తప్పనిసరిగా సత్యదేవ వ్రతం చేయడం తెలుగు ప్రజల సంప్రదాయ. ఈ వ్రత విశిష్టతను పురాణాల్లో సైతం వివరించారు. ఆ మేరకు ఇక్కడ రోజూ సత్యదేవ వ్రతాలు, తిరుమల తరహాలో.. నిత్య కల్యాణాలు జరుగుతుంటాయి.

క్షేత్ర చరిత్ర/ స్థల పురాణం


తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి సుమారు 15 కి.మీ.ల దూరంలోని రత్నగిరి పర్వతంపై 1891-ఖర నామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ విదియ రోజున ఒక అంకుడు చెట్టు కింద తాను వెలుస్తానని సమీపంలోని గోర్స దివాణం జమీందార్‌ రాజా ఇనుగంటి వెంకట రామరాయలకు శ్రీసత్యనారాయణస్వామి స్వయంగా కలలో కనిపించి చెప్పారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాజా తమ గ్రామపెద్దలకు వివరించగా.. అంతా కలిసి స్వామి విగ్రహాల కోసం వెతికారు. కలలో చెప్పినట్లుగా అంకుడు చెట్టు వద్ద శ్రీసత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు దొరికాయి. తాత్కాలికంగా అక్కడ పందిరి వేసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రధానాలయం నిర్మించారు. మరోసారి జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడున్న ఆలయాన్ని, రాజగోపురాన్ని నిర్మించారు.

దర్శన వేళలు

ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే. దర్శన సమయంలో విరామం: రోజూ స్వామివారికి మహానివేదన కోసం... మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 30 నిమిషాల పాటు దర్శనాలు ఆపేస్తారు. నివేదన అనంతరం మళ్లీ కొనసాగిస్తారు.

ప్రత్యేక పూజలు, టికెట్ల వివరాలు

* ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తారు.
* సాధారణ వ్రతమైతే రూ. 150, ప్రత్యేక వ్రతమైతే రూ.300, ధ్వజస్తంభం వద్ద చేసేందుకు రూ. 700, విశిష్ట వ్రతమైతే.. రూ. 1500 చొప్పున రుసుం చెల్లించాలి
* వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు, అరటిపళ్లు తీసుకొస్తే సరిపోతుంది. మిగతా పూజా సామగ్రి ప్రసాదం, స్వామివారి రూపు, పసుపు, కుంకుమ, తమలపాకులు తదితర పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చుతుంది. వ్రతకర్తలైన భార్యాభర్తలతో పాటు వారి పిల్లల్ని అనుమతిస్తారు.

విశేషాంశాలు..పరిసరాల్లోని ఉపాలయాలు: 


కొండదిగువున ఘాట్‌రోడ్డు ప్రారంభంలో గ్రామ దేవత శ్రీ నేరేళ్లమ్మ తల్లి ఆలయం, తొలిమెట్టు వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం, కొండపైకి వచ్చే మెట్ల మార్గం మధ్యలో వనదుర్గ అమ్మవారి ఆలయం, రత్నగిరి కొండపై క్షేత్రపాలకుడు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయం ఉన్నాయి. అన్నింటిలో దర్శనం ఉచితం. అలాగే ఇక్కడున్న పంపా జలాశయంలో నౌకా విహారం... ఫలభా యంత్ర(సన్‌ డయల్‌) సందర్శన పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అన్నవరం సత్యదేవుని ప్రసాదానికి విశేష ప్రాధాన్యం ఉంది. దూరప్రాంత భక్తులు ప్రత్యేకంగా ఈ ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో తమ బంధువులు... సన్నిహితుల కోసమని తీసుకెళ్తుంటారు.అన్నవరం

శ్రీ సత్యదేవునికి నిర్వహించే నిత్యపూజల సమయాలు:


* రోజూ తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ
* 5 గంటలకు ధూపసేవ
* ఉదయం 7 గంటలకు బాలభోగం
* 7.30 గంటలకు బలిహరణ
* ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ చతుర్వేద పారాయణలు
* మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన
* సాయంత్రం 6 గంటలకు ధూపసేవ
* రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకూ దర్బారు సేవ
* రాత్రి 8.30 గంటల నుంచి 9 గంటల వరకూ ఏకాంత సేవ

పూజల్లో పాల్గొనేందుకు రుసుముల వివరాలు:

* పౌర్ణమికి నిర్వహించే ప్రత్యంగిర హోమంలో పాల్గొనేందుకు రూ.558
* స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం ఘనాపాఠీల ఆశీర్వచనానికి రూ. 558
* పవళింపుసేవలో పాల్గొనేందుకు.. రూ. 50
* స్వామివారి శాశ్వత కల్యాణం(పదేళ్లు మాత్రమే) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 10వేలు
* శ్రీ స్వామివారి వ్రతం(పదేళ్లు) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 7 వేలు
* స్వామివారి శాశ్వత నిత్యపూజ(పదేళ్లకు) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 500

ఆలయ మూర్తులకు నిర్వహించే ఇతర సేవలు:

రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ శ్రీ స్వామివారికి నిత్యకల్యాణం జరుగుతుంది. ఇందులో పాల్గొనదల్చిన భక్తులు రూ. 1,000 రుసుం చెల్లించాలి. ఆ మేరకు దేవస్థానమే పూజాసామగ్రి సమకూరుస్తుంది. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కండువా, జాకెట్టు ముక్క, ప్రసాదం, బంగీ ప్రసాదం అందజేస్తారు.
* శ్రీ స్వామివారి మూలవరులకు అభిషేకం(ప్రతి నెలా ముఖ నక్షత్రం రోజున)రూ. 3,000 టిక్కెట్‌పై అనుమతిస్తారు.
* రత్నగిరిపై సప్త గోపూజ నిత్యం జరుగుతుంది. రూ. 116 రుసుం చెల్లించాలి.
* శ్రీ సత్యనారాయణస్వామివారి మూలవరులకు స్వర్ణపుష్పార్చన. 108 బంగారు పుష్పాలతో పూజచేసి ప్రసాదం అందిస్తారు. దీనికి రూ. 3 వేలు రుసుముగా చెల్లించాలి.

ఉపాలయాల్లో నిర్వహించే పూజలు: 

ప్రతి శుక్రవారం రత్నగిరిపై ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీహోమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు భక్తులు ఒక్కొక్కరికి రూ. 558 చెల్లించాలి.

ప్రత్యేక రోజుల్లో విశిష్ట పూజలు:

చైత్రశుద్ధ పాడ్యమి పంచాంగ శ్రవణం, చైత్రశుద్ధ అష్టమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీరామనవమి కల్యాణ ఉత్సవాలు జరుగుతాయి.
 * చైత్ర బహుళ షష్టి నుంచి అమావాస్య వరకూ కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు, శ్రీ నేరేళ్లమ్మ ఉత్సవాలు, శ్రీ స్వామివారి జయంతి వేడుకలు, శ్రీకృష్ణజయంతి, వినాయక చవితి నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు, కార్తీకమాసంలో ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి లక్షపత్రి పూజ చేస్తారు.
* ప్రతి సోమవారం అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, గిరి ప్రదక్షిణ, జ్వాలా తోరణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

వసతి, భోజన సౌకర్యం వివరాలు:

 రత్నగిరిపైన.. అన్నవరంలోనూ దేవస్థానం చౌల్ట్రీలు.. కాటేజ్‌లు... సత్రాల్లో భక్తులకు వసతి కల్పిస్తారు. మొత్తం మీద సుమారు 500 గదులకు పైగా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రోజుకు కనిష్టంగా రూ. 150 నుంచి గరిష్ఠంఆ రూ. 3వేల వరకూ రుసుం వసూలు చేస్తారు. వీటికి ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు బుకింగ్‌ సదుపాయం ఉంది. వీటితో పాటు పలు ప్రైవేటు.. ఆధ్యాత్మిక సంస్థల వసతిగృహాలూ భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి. దేవస్థానం నిత్యాన్నదాన పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం అందిస్తోంది.

రవాణా సౌకర్యం:

కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై తుని పట్టణానికి 18 కి.మీ.ల దూరంలో.. కాకినాడ నగరానికి 45 కి.మీ.ల దూరంలో.. రాజమహేంద్రవరానికి 80 కి.మీ.ల దూరంలో.. విశాఖపట్నం నుంచి 120 కి.మీ.ల దూరంలో అన్నవరం ఉంది. అన్నవరం రైల్వేస్టేషన్‌ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది. విశాఖపట్నం.. రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరవచ్చు.

ఆన్‌లైన్‌ సేవలు:

 దేవస్థానంలో వసతిగదులు, వ్రత, కల్యాణ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌చేసుకోవచ్చు. వసతి గదులకు మాత్రం సాధారణ ధరకన్నా 50శాతం ఎక్కువ చెల్లించాలి. ఈ సేవలన్నింటినీ మీ-సేవ కేంద్రాల్లో బుక్‌చేసుకునే అవకాశముంది. మరిన్ని వివరాలకు... ఫోన్‌ 08868-238163 నంబర్లలో దేవస్థానం అధికారులను సంప్రదించవచ్చు.

శ్రీ రాఘవేంద్రస్వామి


శ్రీ రాఘవేంద్రస్వామి

భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం- శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు.. పర్యాటకులు వస్తుంటారు.



 క్షేత్రచరిత్ర/స్థల పురాణం: 

మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం. మంచాల గ్రామంగా పిలిచేవారు. ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల రాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ (రేణుకాంబ రూపిణి) రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉంచాలని ఆజ్ఞాపించిందట! దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు. అప్పటి నుంచి నిత్యం రాఘవేంద్రస్వామి మూల బృందావననానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని... అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకొంటారు.

 చరిత్ర విశేషాలు:

తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు (రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే!) 1595లో జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి.. ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12ఏళ్లపాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ.

అనంతరం పవిత్ర తుంగభద్ర నదీతీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్‌ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చెయ్యాలంటూ దివాన్‌ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట! త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు ఏడుగంటలపాటు విశ్రాంతినిచ్చిందని.. ఆ మేరకు 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి పొందారు.

ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు: 

కర్ణాటక సరిహద్దులోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం: ఇక్కడే రాఘవేంద్రస్వామి 12 ఏళ్లపాటు తపస్సు చేశారట! నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు.

పాతూరు: 

రాఘవేంద్రస్వామి మొదట ఈ గ్రామానికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారట. ఇక్కడ స్వామి వారి విగ్రహాన్ని స్వయంగా రాఘవేంద్ర స్వామివారే చెక్కారట!

* వెంకన్న ఆచారి ఏకశిలా బృందావనం: రాఘవేంద్రస్వామి ప్రధాన శిష్యుడు వెంకన్న ఆచారి వద్ద రాఘవేంద్రస్వామి రెండు సంవత్సరాలు ఉన్నారట. ఆ మేరకు ఈ వెంకన్నే స్వామివారికి ఏకశిలతో బృందావనం కట్టించారు.

* రాఘవేంద్రస్వామి దర్శనానంతరం భక్తులకు ప్రత్యేకంగా పరిమళ ప్రసాదం అందిస్తారు. రూ. 20కి 4 ముక్కలు ఇస్తారు. ఇది ఇక్కడి ప్రత్యేక ప్రసాదం.

దర్శనవేళలు: 

రోజూ ఉదయం 6 గంటల నుంచి 8.30 వరకూ దర్శనానికి అనుమతిస్తారు.
 మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి ఉ. 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు.
 తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం.
ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు.

నిత్యాన్నదానం:

భక్తులందరికీ ఉచిత నిత్యాన్నదానం ఉ. 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉంటుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ రూ. 2కు పులిహోర, పెరుగు అన్నం ఇస్తారు.

 మఠంలో ప్రధాన పూజలు: 

1. సంపూర్ణ అన్నదాన సేవ: 

ఒకరోజు సంపూర్ణ అన్నదాన సేవకోసం రూ. 2లక్షలు చెల్లించాలి. ఈ సేవకు 10మందిని అనుమతిస్తారు. 99 పరిమళ ప్రసాదాలు వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. ఒకరోజు వసతి కల్పిస్తారు. ఏడాదిలో ఎప్పుడైనా ఒకరోజు ముందే శ్రీమఠంలో నమోదు చేసుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే పూజల్లో పాల్గొనవచ్చు.

2. సమర్పణ సేవ: 

ఒక రోజు సమర్పణ సేవకు రూ. లక్ష చొప్పున చెల్లించాలి. పదిమందిని అనుమతిస్తారు. 99 పరిమళ ప్రసాదాలు, వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. ఒక రోజు వసతిసౌకర్యం ఉంటుంది. ఎప్పుడైనా ఒకరోజు ముందే శ్రీమఠంలో నమోదు చేసుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రివరకూ జరిగే పూజల్లో పాల్గొనవచ్చు.

3. వస్త్ర సమర్పణ సేవ: 

వస్త్ర సమర్పణ సేవకు రూ.50 వేలు రుసుం. అన్ని బృందావనాలతో పాటు పీఠాధిపతికి పట్టు వస్త్రాలు ఇస్తారు. పదిమందిని అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. భక్తులు ఒకరోజు ముందే మఠానికి చేరుకోవాలి. పూజకు ముందురోజూ, సాయంత్రం పట్టువస్త్రాలను భక్తులతో వూరేగింపుగా తీసుకొస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే అన్ని పూజల్లో పాల్గొనవచ్చు. వసతి సౌకర్యం కల్పిస్తారు. ఒకరోజు ముందే ఈ పూజ కోసం నమోదు చేసుకోవాలి.

4. పట్టువస్త్ర సమర్పణ సేవ: 

ఇది రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి, పీఠాధిపతికి మాత్రమే. ఇందులో పాల్గొనేందుకు రూ. 25వేలు చెల్లించాలి. 10మందిని అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక అందజేస్తారు. ఒకరోజు ముందు శ్రీమఠానికి చేరుకోవాలి. ముందురోజు సాయంత్రం పట్టువస్త్రాలు వూరేగింపుగా తీసుకొస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే అన్ని పూజల్లో పాల్గొనవచ్చు. ఒకరోజు వసతి సౌకర్యం కల్పిస్తారు.

5.బంగారు పల్లకి సేవ: 

మఠంలో బంగారు పల్లకి సేవలో పాల్గొనేందుకు రూ. 8వేలు రుసుం చెల్లించాలి. రోజుకు 10 మందిని మాత్రమే అనుమతిస్తారు. 25 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం ఇస్తారు. ఉదయం 9.30 గంటలకు పూజ జరుగుతుంది. గంట ముందే శ్రీ మఠానికి చేరుకోవాలి.

6. బంగారు రథోత్సవ సేవ: 

బంగారు రథోత్సవ సేవకు రూ. 6వేలు చెల్లించాలి. రాత్రి 7.30 గంటలకు ఈ సేవ జరుగుతుంది. 10మందిని అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం ఇస్తారు. అదేరోజు సాయంత్రం గంట ముందు శ్రీమఠానికి చేరుకోవాలి.

7. కనక కవచ సమర్పణ సేవ:

 కనక కవచ సమర్పణ సేవకు రూ. 3,500 రుసుం. 8 మందిని అనుమతిస్తారు. 25 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం ఇస్తారు. ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. గంట ముందు మఠానికి చేరుకోవాలి.

8. రజత రథోత్సవ సేవ: 

ఈ రజత రథోత్సవ సేవలో పాల్గొనదల్చిన భక్తులు రూ. 2 వేలు రుసుంగా చెల్లించాలి. ఆరుగురిని అనుమతిస్తారు. 25 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రాలు ఇస్తారు. రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. గంట ముందు మఠానికి చేరుకోవాలి.

9. రథోత్సవ(చెక్క)సేవ: 

(చెక్క) రథోత్సవ సేవ కోసం భక్తులు రూ. 1000 చెల్లించాలి. రాత్రి 7.30కి ఈ సేవ నిర్వహిస్తారు. నలుగురికి అనుమతి ఉంటుంది. 20 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, శాలువా ఇస్తారు. దీనికి ముందురోజే నమోదు చేసుకుని మఠానికి చేరుకోవాలి.

10. కనక మహాపూజ:

 ఈ పూజ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. రూ. 750 చెల్లించాలి. నలుగురిని అనుమతిస్తారు. 20 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం అందజేస్తారు.

11.పూర్ణసేవ: 

పూర్ణసేవ రోజూ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు రూ. 500 చెల్లించాలి. నలుగురిని అనుమతిస్తారు. 15 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం అందజేస్తారు.

12. మహాపూజ: 

మహాపూజ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. దీనికోసం భక్తులు రూ. 350 చెల్లించాలి. ముగ్గురిని అనుమతిస్తారు. 10 పరిమళ ప్రసాదాలు, వస్త్రం ఇస్తారు. గంట ముందు మఠంలో ఉండాలి.

13. సర్వసేవ: 

సర్వసేవ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు రూ. 250 చెల్లించాలి. ఇద్దరిని అనుమతిస్తారు. 10 పరిమళ ప్రసాదాలు, వస్త్రం బహుమతిగా ఇస్తారు. సేవకు గంట ముందు మఠంలో ఉండాలి.

14. ఉత్సవరాయ పాదపూజ: 

ఉత్సవరాయ పాదపూజ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. రూ. 200 చెల్లించాలి. ఇద్దరికీ అనుమతి ఉంటుంది. వస్త్రం ఇస్తారు. పూజకు ముందుగానే హాజరవ్వాలి.

15 ఫల పంచామృతాభిషేకం:

 ఫల పంచామృతాభిషేకం ఉదయం 8.30 గంటలకు జరుగుతుంది. రూ. 150 చెల్లించాలి. ఇద్దరిని అనుమతిస్తారు. వస్త్రం ఇస్తారు.

16. పంచామృత సేవ: 

ఉదయం 8.30 గంటలకు జరుగుతుంది. రూ. 75 చెల్లించాలి. ఇద్దరిని అనమతిస్తారు. వస్త్రం ఇస్తారు.

17. శ్రీవాయుస్తుతి పునశ్చరణ సేవ: 

బృందావనానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామికి ఈ సేవ చేస్తారు. ఇది ప్రతి శుక్రవాం మాత్రమే ఉదయం 7.30 ఉంటుంది. రూ. 500 చెల్లించాలి. నలుగురిని అనుమతిస్తారు. 10 పరిమళ ప్రసాదాలు, వస్త్రం ఇస్తారు.

18. శ్రీవాయుస్తుతి పునశ్చరణ(శుద్ధోదక): 

ఆదివారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం 7.30కు నిర్వహిస్తారు. రూ. 200 చెల్లించాలి. ఇద్దరికి అనుమతి ఉంటుంది. నాలుగు పరిమళ ప్రసాదాలు, వస్త్రం ఇస్తారు.

 19. శ్రీ సత్యనారాయణ స్వామిపూజ: 

ఉదయం 9 గంటలకు జరుగుతుంది. రూ. 200 చెల్లించాలి. వస్త్రం ఇస్తారు. 20 సామూహిక సత్యనారాయణ స్వామిపూజ: పౌర్ణమిరోజు మాత్రమే చేస్తారు. రూ. 50 చెల్లించాలి. ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఈ పూజలో పాల్గొనేందుకు పౌర్ణమికి ముందు రోజు నమోదు చేసుకోవాలి.

21. గోదాన సేవ: 

ఉదయం 9 నంచి 12 వరకూ ఉంటుంది. రూ. 5 వేలు చెల్లించాలి. కుటుంబం మొత్తం అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి మఠం జ్ఞాపిక ఇస్తారు.
* ఆయా ఆర్జిత సేవలను భక్తులు ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు లేదా నేరుగా శ్రీ మఠానికి వచ్చి.. బుక్‌ చేసుకోవచ్చు.

మఠంలో వసతి.. ఇతర సౌకర్యాలు: 

ఇక్కడ భక్తుల కోసం నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. రోజు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ అన్న ప్రసాద వితరణ ఉంటుంది. రాత్రి భోజనంగా రూ. 2కు పెరుగన్నం.. చిత్రాన్నం ఇస్తారు. 

వసతి:

మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులున్నాయి. ఇవికాక కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్‌హౌస్‌ల్లోనూ గదులు అందుబాటులో ఉంటాయి.

అదనపు సమాచారం: రూ. 8 వేల నుంచి రూ. 2లక్షల వరకు విరాళంగా అందించే వారికి ఇక్కడ వసతి సౌకర్యం కల్పిస్తారు.

* ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలుండవు. కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
* ద్వాదశి, ఆరాధనోత్సవాల సమయంలో పూజ వేళల్లో మార్పులుంటాయి. మిగతారోజుల్లో సాధారణమే.

మరిన్ని వివరాలకు... 

http://www.mantralayam.com/raghavendra.htm

దీంతోపాటు సేవలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఇ-మెయిల్‌ ఐడీ: info@srsmat.org
 ఫ్యాక్స్‌ నెంబర్‌: 08512-279889

కాణిపాకం-వినాయకుడు

కాణిపాకం-వినాయకుడు

సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.

క్షేత్రచరిత్ర/ స్థలపురాణం: 

 సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.

ఈ బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య!


 కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..!

నిత్యం పెరిగే స్వామి:


 వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు. కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.

బ్రహ్మహత్యా పాతక నివారణార్థం:

 స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.


దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు:


మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు.

సర్పదోష పరిహారార్థం.. వరదరాజస్వామి ఆలయ నిర్మాణం

 స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు. పంచామృతాభిషేకం టిక్కెట్‌ ధర: రూ. 550


సేవాఫలితం: 

స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం. ఈ సేవల్లో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి.
గణపతి హోమం టిక్కెట్‌ ధర: 500

సేవాఫలితం: 

‘కలౌ చండీ వినాయకః’

 అంటే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు.. చండి(దుర్గా), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి. అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి.
గణపతి మోదకపూజ టిక్కెట్‌ ధర: 300

గణపతి పురాణంలో సహస్రనామాల్లో ‘మోదక ప్రియాయనమః’ 

అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు.
సహస్ర నామార్చన, వ్రతపూజ టిక్కెట్‌ ధర: రూ. 150, రూ. 58

సేవాఫలితం: 

‘కలౌ గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంది.
మూల మంత్రార్చన టిక్కెట్‌ ధర: రూ. 300

సేవాఫలితం: 

దీనినే నారికేళ పూ అంటారు. వినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత.. అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతుష్ఠి చెందుతారు. సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి.
సంకటహర గణపతి వ్రతం టిక్కెట్‌ ధర: రూ. 151

సేవాఫలితం: 

గణేశ పురానంలో ఈ వ్రతానికి విశేష స్థానం కల్పించారు. దీన్ని శ్రీ కృష్ణుడు, బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ధి, సకల విఘ్నాలు తొలగడం, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు.
పూలంగి సేవ టిక్కెట్‌ ధర: రూ. 1,000

సేవాఫలితం:

 వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంత్రాలయం, అర్ధమండపం, స్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం కలుగుతాయి.
అక్షరాభ్యాసం టిక్కెట్‌ ధర: రూ. 116

సేవాఫలితం: 

చదువుల తండ్రి వినాయకుడు. అలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది.
అన్నప్రాసన టిక్కెట్‌ ధర: రూ.116

సేవాఫలితం: 

పిల్లలకు అన్నప్రాసనం, విశిష్ఠరోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.
వివాహ ఆహ్వానపత్రికలకు పూజలు టిక్కెట్‌ ధర: రూ. 51
సేవాఫలితం: వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయి.

వసతి.. రవాణా సౌకర్యాలు: 

కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు.. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా.. అటు తిరుమల.. శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు కనుక.. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి.
తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయి. దగ్గరలోని రైలు.. విమాన మార్గ సదుపాయం అంటే.. తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.

శ్రీ కాళహస్తీశ్వరాలయం

శ్రీ కాళహస్తీశ్వరాలయం


ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి 37 కి.మీ.ల దూరంలో స్వర్ణముఖి నదీతీరంలో వెలసిన శ్రీ కాళహస్తీశ్వరాలయం.. భక్తుల పాలిట భూకైలాసంగా.. వాయులింగ స్థానంగా ప్రఖ్యాతి గాంచింది. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం తమిళనాడులో ఉంటే.. ఒక్క వాయులింగం మాత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైంది. ఈ క్షేత్రం రాహు,కేతు, సర్పదోష నివారణ క్షేత్రంగా విరాజిల్లుతోంది.
క్షేత్ర చరిత్ర/ స్థలపురాణం: ఇక్కడ కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభువు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ అమ్మవారు జ్ఞానాంబిక పూజలందుకుంటోంది. బ్రహ్మదేవుని చేత పూజలందుకుంటున్న ఈ శైవక్షేత్రం ఏటికేడు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ (సాలెపురుగు), కాళం(పాము), హస్తి(ఏనుగు)ల పేరిట ఏర్పడ్డ ఈ క్షేత్రం... ఆ మూడు మూగజీవుల దైవభక్తికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ మూడు జీవులు ఇక్కడి శివయ్యను ఆరాధించి.. చివరకు ఆయనలోనే ఐక్యమయ్యాయి. భక్త కన్నప్ప వృత్తాంతమూ ఈ క్షేత్రానికి సంబంధించిందే. కుజదోష నివారణ పూజలు.. నాగదోష నివారణ పూజలు.. నవగ్రహ దోష నివారణ పూజలు ఈ క్షేత్రంలో ప్రత్యే ప్రభావం కనబరుస్తాయన్నది భక్తుల విశ్వాసం. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది!
ఆలయ దర్శన వేళలు: ఉదయం 4.30 గంటలకు మంగళ వాయిద్యాలతో స్వామిని మేల్కొలుపుతారు. అప్పటినుంచి రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవ ముగిసే వరకూ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఎలాంటి విరామం లేకుండా సర్వదర్శనం ఉంటుంది! రూ. 50 ప్రత్యేక దర్శన టికెట్టుకూ ఇదే వర్తిస్తుంది! గ్రహణ కాలాల్లోనూ స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఈ దేవాలయం తెరిచే ఉంటుంది!
నిత్యసేవలు/ ప్రధాన పూజలు:  రోజూ ఉదయం 4.30 గంటలకు: మంగళ వాయిద్యాలతో సుప్రభాత సేవ.
* ఉదయం. 5.45, ఉదయం 6.45, ఉదయం 10 గంటలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ కాల అభిషేకాలు. ద్వితీయ కాల అభిషేకానంతరం నిత్యోత్సవం, నిత్యకల్యాణం, చండీ, రుద్రహోమాలు. శనేశ్వరునికి విశేష పూజలు. అభిషేకాలు.

* ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాహు, కేతుసర్పదోష నివారణ పూజలు.
* సాయంత్రం 5 గంటలకు ప్రదోష కాల అభిషేకం
* సాయంత్రం 6.30 గంటలకు షోడశోపచార నివేదన
*రాత్రి 9.30 ఏకాంతసేవ
ఆర్జిత సేవల రుసుములు: సుప్రభాత సేవ రూ.50, గోమాత పూజ రూ. 50, అర్చన రూ. 25, సహస్ర నామార్చన రూ. 200, త్రిశతి అర్చన రూ. 125, సోమవారం ప్రదోష కాల సమయంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రూ. 1,500, క్షీరాభిషేకం రూ. 100, పచ్చకర్పూర అభిషేకం (స్వామివారికి) రూ. 100, రుద్రాభిషేకం రూ. 600, పంచామృత అభిషేకం రూ. 300, నిత్యదిట్ట అభిషేకం రూ. 100, శనేశ్వర అభిషేకం రూ. 150, అఖండ దీపారాధన రూ. 50, ప్రత్యేక ప్రవేశం రూ. 50, నిత్యోత్సవం రూ. 58, నిత్య కల్యాణోత్సవం రూ. 501, రుద్రహోమం రూ. 1116, చండీహోమం రూ. 1116, అష్టోత్తర స్వర్ణ కమల పుష్పార్చన( ప్రతి శుక్రవారం) రూ. వెయ్యి, ప్రత్యేక ఆశీర్వచనం రూ. 500, సాధారణ సర్పదోష పూజలు రూ. 300 ప్రత్యేక సర్పదోష నివారణ రూ. 750, ఆశీర్వచన, సర్పదోష నివారణ రూ. 1,500, ప్రత్యే ఆశీర్వచనం, సర్పదోష నివారణ రూ. 2,500 (ప్రొటోకాల్‌ మేరకు మాత్రమే), ఏకాంత సేవ రూ. 100. వాహనపూజలు(పెద్దవి) రూ. 25( చిన్నవి) రూ. 20.
భక్తులకు ఇచ్చే బహుమానాలు..
ఆలయంలో జరిగే అభిషేక సేవలకు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. రుద్రాభిషేకానికి పులిహోర, లడ్డూ, కండువా, జాకెట్టు గుడ్డ, స్వామి అమ్మవార్ల చిత్రపటం, పంచామృతం, పచ్చకర్పూర తీర్థజలం, విభూది ఆలయం తరఫున అందజేస్తారు.
పచ్చకర్పూర అభిషేకం చేయించిన భక్తులకు తీర్థంగా పచ్చకర్పూర జలాన్ని, పంచామృత అభిషేకం చేయించిన భక్తులకు అభిషేకం చేసిన పంచామృతాన్ని కానుకగా అందజేస్తారు.
నిత్య కల్యాణోత్సవం చేయించిన వారికి లడ్డూ, వడ... చండీ, రుద్రహోమాలు చేయించిన వారిని ఉప్పు పొంగలి ప్రసాదంగా అందజేస్తారు.
వసతి.. రవాణా సౌకర్యం: విజయవాడ-రేణిగుంట మార్గంలో శ్రీకాళహస్తి క్షేత్రం వుంది. రైలు.. రోడ్డు మార్గాల్లో చేరుకోవచ్చు. ప్రతి 15 గంటలకో సర్వీసు చొప్పున బస్సులు ఉన్నాయి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి కూడా శ్రీకాళహస్తికి నేరుగా బస్సు సౌకర్యముంది. సమీపంలోని రేణిగుంటలో తిరుపతి విమానాశ్రయముంది.
ఇక ఇక్కడకు శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ఆలయం తరఫున పలు అతిథి గృహాల్లో అందుబాటులో ఉన్నాయి. నామమాత్రపు అద్దెలతో భక్తులు ఇక్కడ వసతి పొందవచ్చు. అలాగే పట్టణంలోనూ పలు ప్రభుత్వ/ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు.. అద్దెగదులు లభిస్తాయి.
ఆ వివరాలతోపాటు.. ఆలయంలో జరిగే వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు... ముందస్తు బుకింగ్‌ల కోసం... 08578- 222240 నెంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

తిరుమల

దేవ దేవుడు.. శ్రీ వేంకటేశుడు -- తిరుమల

‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’


 బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీనివాసుడికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ.. అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు... ఇదీ శ్లోకానికి అర్థం.

 తిరుమల పుణ్యక్షేత్రం ‘కలియుగ వైకుంఠ’మని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూలకారణం.. స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీవేంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉన్నారు. ఆనందనిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి ‘ఆనంద నిలయ’మనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది.

  స్థలపురాణం

కలియుగారంభంలో... అనగా సుమారు 5వేల సంవత్సరాల క్రితం.. వక్ష స్థల మహాలక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. వేంకటపతికి నిత్యోత్సవ, వార్షికోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నారాయణవనం అధిపతులు ఆకాశరాజు, తొండమాన్‌ చక్రవర్తి, పల్లవరాణి సామవై, విజయనగర సామ్రాజ్యాధీశులు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలరాయలు, అచ్యుతరాయలు ఇలా.. ఎందరో మహానుభావులు.. ఇక్కడ అద్భుత నిర్మాణాలను చేపట్టి అపూర్వసేవా కైంకర్యాల నెలవుగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు.


శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన వరాహస్వామివారిని దర్శించుకోవాలని స్థలపురాణంలో ఉంది. అలాగే స్వామి వారి దర్శనానంతరం... తిరుపతిలో పద్మావతి/బీబీనాంచారి/అలివేలుమంగ అమ్మవారిని, గోవిందరాజస్వామి వారిని దర్శించుకోవాలి. తిరుమలగిరులలో ఉన్న పవిత్ర ఆకాశగంగ.. పాపనాశనం.. వకుళమాత ఆలయం,, హాథీరాంజీ మఠం.. త్రిదండి జీయర్‌స్వామివారి మఠం..వన్యప్రాణుల పార్క్‌.. వంటి ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాశస్త్యమున్న ప్రాంతాల్ని దర్శించుకోవచ్చు. తితిదే బస్సు సర్వీసులతో పాటు ఆయా ప్రదేశాలకు ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. తలనీలాలు మొక్కుబడి ఉన్నవారు తప్పనిసరిగా స్వామివారి ‘కల్యాణకట్ట’ వద్దనే తలనీలాలు సమర్పించాలి

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన వేళలు


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక దర్శనవేళలు ఒక్కోరోజు ఒక్కోవిధంగా ఉంటాయి. స్వామివారికి జరిగే నిత్య, వారపు సేవలను బట్టి ఆయా సమయాలను తితిదే నిర్దేశించింది. టిక్కెట్లను ముందస్తుగా అంతర్జాలం, ఈ-దర్శన్‌, తపాలా శాఖ ద్వారా విక్రయిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రంలోపు నిర్దేశించిన సమయంలోపు శ్రీవారిని దర్శించుకునే వేళలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న సమయం టిక్కెట్టుపై ముద్రితమవుతుంది. ఈ సమయానికి మాత్రమే ఆలయానికి చేరుకోవడానికి వరుస వద్దకు రావాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నిత్యం రూ.300 ధర వంతున 26వేల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 56 రోజులకు ముందుగా టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. విశేష పర్వదినాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ల సంఖ్యను దేవస్థానమే తగ్గిస్తుంది.


తితిదే ప్రకటించిన వేళల వివరాలివీ:

  •  వారం సమయం ఆదివారం ఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు 
  • సోమవారం ఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు 
  • మంగళవారం ఉదయం 9గం. నుంచి సాయంత్రం 7 గం. వరకు 
  • బుధవారం ఉదయం 10గం. నుంచి సాయంత్రం 7గం. వరకు 
  • గురువారం ఉదయం 9గం. నుంచి సాయంత్రం 4గం. వరకు 
  • శుక్రవారం ఉదయం 10గం. నుంచి సాయంత్రం 4గం. వరకు 
  • శనివారం ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు

వృద్ధులకు, వికలాంగులకు దర్శన వేళలు:

 శ్రీవారి దర్శనానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు తితిదే ప్రత్యేక ప్రవేశ అవకాశం కల్పిస్తోంది. మందిరం మహాద్వారం సమీపం నుంచి ఆలయంలోకి చేరుకునే సౌలభ్యం కల్పించింది. నిత్యం ఉదయం 10, మధ్యాహ్నం 3గంటలకు ఆలయ ప్రవేశాలకు అనుమతిస్తుంది. ఈ దర్శన సమయాల కన్నా గంట ముందుగా ఆయా భక్తులు పరిశీలనకు హాజరవ్వాల్సి వుంటుంది. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వయస్సు ధ్రువీకరణ పత్రం ఆధారంగా అనుమతిస్తారు. నడవలేని పరిస్థితిలో ఉన్నవారి వెంట సహాయకులను అనుమతిస్తారు. వికలాంగులు, గుండె జబ్బుతో ఆపరేషన్‌ చేసుకున్న భక్తులను వైద్యులు జారీచేసి పత్రాల పరిశీలన అనంతరం అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో ఈ దర్శనాలను తితిదే రద్దు చేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తితిదే ముందుగానే ప్రకటిస్తుంటుంది.


తిరుపతి-తిరుమలకు ప్రయాణ సదుపాయాలు

 తిరుమల, తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు రోడ్డు.. రైలు.. ఆకాశ మార్గాల్లో విస్తృతమైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకునే భక్తులకు స్టేషన్‌ ఎదురుగానే కొండపైకి తీసుకెళ్లే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి తిరుమలకు ప్రతి నిమిషానికో బస్సు చొప్పున బ్రహ్మోత్సవాల సమయంలో నడుస్తుంటాయి. ప్రీపెయిడ్‌ ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.


రేణిగుంట విమానాశ్రయం నుంచి నిత్యం మధ్యాహ్నం ఒక ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ సర్వీసు నిర్వహిస్తున్నారు. ఈ బస్సు తిరుమల నుంచి ఉదయం 11 గంటలకు బయల్దేరి.. రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం 12.30 నిమిషాలకు చేరుతుంది. తిరిగి విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుమలకు బయల్దేరుతుంది. విమానాశ్రయంలో ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. తిరుపతి కేంద్రంగా ఉన్న ట్రావెల్‌ కంపెనీలకు సమాచారం ఇచ్చే పక్షంలో వాహనాలను సమకూర్చుతారు. అన్ని రకాల సొంత వాహనాలనూ తిరుమల వెళ్లేందుకు తితిదే అనుమతిస్తోంది. అలిపిరి భద్రతా వలయంలో తనిఖీలు నిర్వహించుకున్న అనంతరం టోల్‌ రుసుం చెల్లించి ఆయా వాహనాల్లో తిరుమలకు రావాల్సి ఉంటుంది. అన్ని రకాల వాహనాలు అలిపిరి నుంచి తిరుమలకు రెండో కనుమ రహదారిలో 28 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తితిదే వేగ నియంత్రణ చర్యలు చేపట్టింది. అదేవిధంగా తిరుమల నుంచి తిరుపతికి మొదటి కనుమ రహదారిలో ప్రయాణ సమయం 45 నిమిషాలు తీసుకోవాల్సి వుంటుంది. నిర్దేశిత సమయం కంటే ముందుగా వచ్చే పక్షంలో సంబంధిత వాహనాలను తిరుమలకు 10 రోజులపాటు రాకుండా నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంటారు! రెండోసారి కూడా నిబంధనలు పాటించని పక్షంలో జరిమానా విధిస్తారు. సమయాన్ని లెక్కించడానికి అలిపిరి భద్రతావలయంలో వాహనదారులకు తితిదే బార్‌ కోడింగ్‌ రశీదులను జారీ చేస్తుంది.


కాలినడకన వెళ్లే భక్తుల కోసం

అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన రావడానికి తితిదే అనుమతిస్తుంది. అలిపిరి నుంచి 24 గంటల సమయం, శ్రీవారి మెట్టు ల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది. గరుడోత్సవం సమయంలో 24 గంటల సమయం అనుమతించాలని నిర్ణయించింది. అడవి జంతువులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి మెట్టు మార్గంలో పగటి సమయంలో మాత్రమే భక్తుల రాకపోకలకు అనుమతిస్తున్నారు. వీరికి మార్గమధ్యంలో దివ్యదర్శనం టోకెన్లను తితిదే ఉచితంగా జారీ చేస్తుంది. టోకెన్లను పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం ఉచితంగా కల్పించడంతో పాటు ఒక లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారు. రెండు లడ్డూలు కావాలంటే రూ. 10 చొప్పున రాయితీపై అందజేస్తారు. అవసరమైన వారు రూ. 25 ధరపై మరో రెండు లడ్డూలూ పొందవచ్చు. భక్తుల లగేజీని తితిదేయే తిరుమలకు ఉచితంగా చేరవేస్తుంది. అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రవేశమార్గంలో ఈ ఉచిత లగేజీ రవాణా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ భక్తులు తమ లగేజీని డిపాజిట్‌ చేసి రశీదు చూపి ఈ లగేజీని తీసుకోవచ్చు.


బ్రహ్మోత్సవాల సమయంలో తితిదే ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను కరెంటు బుకింగ్‌ కింద ఇవ్వడాన్ని రద్దు చేస్తుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ కింద నిత్యం అంతర్జాలంలో 6వేలు, ఇ-దర్శన కౌంటర్ల ద్వారా మరో 5వేల టికెట్లను రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. టికెట్లలో నిర్దేశించిన సమయానికి ఆయా భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారి దర్శనానికి హాజరుకావాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు, సంప్రదాయ దుస్తులు ధరించని పక్షంలో శ్రీవారి దర్శనానికి అనుమతించరు. ఒక్కో టికెట్‌పై రెండు ప్రసాద లడ్డూలు ఉచితంగా అందజేస్తారు.

 తిరుమలలో భక్తులందరికీ తితిదే స్వామివారి అన్నప్రసాదం అందజేస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో ఉదయం 9.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సిఫార్సు లేకుండా ప్రతిఒక్కరూ ఈ అన్న ప్రసాదాన్ని ఉచితంగా స్వీకరించవచ్చు. బ్రహ్మోత్సవాల్లో రద్దీ ప్రాంతాలను గుర్తించి అక్కడే భక్తులకు అల్పాహారం, పానీయాలనూ అందించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది.


వసతి సౌకర్యం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 24 గంటలపాటు ఉచిత వసతి కల్పిస్తారు. తితిదే ఆధ్వర్యంలో తిరుపతి-తిరుమల ప్రాంతాల్లో సుమారు 15వేల కాటేజ్‌లు భక్తుల కోసం అందుబాటులో ఉన్నాయి. హాథీరాంజీ మఠం, జీయర్‌ మఠం, శంకరమఠం తదితర సంస్థల ఆధ్వర్యంలోనూ వసతి లభిస్తుంది. ఇవికాక ఆర్జితసేవలు పొందేవారి కోసం ప్రత్యేక కాటేజ్‌లు ఉన్నాయి. అలాగే వివిధ రాష్ట్రాల టూరిజం శాఖల అతిథిగృహాలు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల అద్దెగదులు అందుబాటులో ఉన్నాయి. ముందస్తు రిజర్వేషన్‌, ఇతర వివరాలకు తితిదే కార్యాలయంలో సంప్రదించాలి
ఆర్జితసేవ పేరు హాజరు కావాల్సిన సమయం
సుప్రభాతం ఉదయం 2 గంటలకు
వస్త్రాలంకరణ సేవ ఉదయం 3 గంటలకు
అభిషేకం ఉదయం 3 గంటలకు
తోమాల ఉదయం 3గంటలకు
అర్చన ఉదయం 4గంటలకు
నిజపాద దర్శనం ఉదయం 4.30గంటలకు
అష్టదళ పాద పద్మారాధన సేవ ఉదయం 5 గంటలకు
సహస్ర కలశాభిషేకం ఉదయం 5గంటలకు
తిరుప్పావడ సేవ ఉదయం 5గంటలకు
విశేషపూజ ఉదయం 6గంటలకు
కల్యాణోత్సవం ఉదయం 10గంటలకు
వూంజలసేవ ఉదయం 11గంటలకు
ఆర్జిత బ్రహ్మోత్సవం మధ్యాహ్నం 1.30గంటలకు
వసంతోత్సవం మధ్యాహ్నం 2గంటలకు
సహస్ర దీపాలంకరణ సేవ సాయంత్రం 5గంటలకు
ప్రధాన/ ప్రత్యేక పూజలు: నిత్యసేవలు: సుప్రభాతం ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 120 నిత్యసేవలు: తోమాల ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220 నిత్యసేవలు: అర్చన ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220 నిత్యసేవలు: కల్యాణోత్సవం ప్రవేశం: ఇద్దరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 1000 నిత్యసేవలు: ఆర్జిత బ్రహ్మోత్సవం ప్రవేశం: ఒకరికి రోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200 నిత్యసేవలు: డోలోత్సవం ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200 నిత్యసేవలు: సహస్ర దీపాలంకరణ సేవ ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200 నిత్యసేవలు: వారం సేవలు విశేషపూజ ప్రవేశం: ఒకరికిరోజు: సోమవారంటిక్కెట్టు ధర: రూ.600 నిత్యసేవలు: అష్టదళ పాదపద్మారాధనం ప్రవేశం: ఒకరికిరోజు: మంగళవారం టిక్కెట్టు ధర: రూ. 1,250నిత్యసేవలు: సహస్ర కలశాభిషేకం ప్రవేశం: ఒకరికిరోజు: బుధవారంటిక్కెట్టు ధర: రూ.850 నిత్యసేవలు: తిరుప్పావడ సేవ ప్రవేశం: ఒకరికిరోజు: గురువారంటిక్కెట్టు ధర: రూ.850 నిత్యసేవలు: అభిషేకం ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.750 నిత్యసేవలు: నిజపాద దర్శనం ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.200 నిత్యసేవలు: వస్త్రాలంకరణ సేవ ప్రవేశం: ఇద్దరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ. 12,250