ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి?

‘‘మహావరాహో గోవిందః సుషేణాః కనకాంగది’’ ఆదివరాహమూర్తే గోవిందుడు. తిరుమల ప్రధానంగా ఆయన క్షేత్రమే. శ్రీనివాసుడు వచ్చి అక్కడ ఉండటానికి అనుమతి కోరితే అందుకు వరాహస్వామి అంగీకరించాడు.అందుకు కృతజ్ఞతగా తన వద్దకు వచ్చే భక్తులకు తనకన్నా ముందే ఆయననే దర్శించుకుంటారనిశ్రీవారు వరాహమూర్తికి మాట ఇచ్చారు. అందుకే తిరుమల వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాత వేంకటేశ్వరుణ్ని దర్శించుకుంటే యాత్రాఫలం దక్కుతుంది.

మనం చేసే తప్పులకు మన బాధ్యత ఎంతవరకు ఉంటుంది?

బుద్ధి కర్మానుసారిణీ... అంటారు. అంటే గతజన్మ కర్మఫలం మనిషిని నడిపిస్తుంది. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ కష్టాలు పడుతున్నవారు పూర్వ జన్మలో ఇంతకుమించిన పాపఫలాన్ని మూటగట్టుకున్నారని అర్థం. ఇప్పుడు దుష్కర్మలు ఆచరిస్తూ కూడా సుఖంగా జీవిస్తున్న వారు గత జన్మలో సత్కార్యాలు చేసిఉంటారు.

కానీ పైజన్మకు మోయలేనంత పాపభారాన్ని సిద్ధం చేసుకుంటున్నారని వారికి తెలియదు. ఈ కర్మఫలాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వడమే భగవంతుడు చేస్తున్న పని. కానీ పాపపుణ్యాల తేడా తెలుసుకుని విచక్షణా జ్ఞానంతో ప్రవర్తించగలిగే అవకాశం, శక్తి దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. అందుకే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఈ జన్మలో సత్కార్యాలు చేస్తే మరుజన్మకు పుణ్యం సంపాదించుకోగలరు. మనం చేసే తప్పొప్పులకు పూర్తి బాధ్యత మనదే.

వేంకటేశ్వరస్వామి విష్ణురూపమా? శివరూపమా? శక్తిరూపమా?

తిరుమలేశుని విగ్రహం ఆగమాలకు అందని రూపం. వక్షస్థలంపై కౌస్తుభం, చేతికి నాగాభరణాలు, ఆలయగోపురంపై శక్తి వాహనమైన సింహం.. ఇలా విభిన్నదేవతా చిహ్నాలు కలిగిన దివ్యమనోహర విగ్రహం. ‘‘ఇరుండరువురం ఒండ్రాయ్‌ ఇసైందు’’ (ఇరుమూర్తులూ నీయందే ఉన్నాయి) అంటూ పెయ్‌ ఆళ్వార్‌ నోరారా కీర్తించాడు. ‘‘స్కంధ విష్ణ్వాత్మికా శక్తిః వేంకటేశ ఇతీరతః’’ అని స్కంధ పురాణం చెబుతోంది.అంటే శ్రీవారి మూర్తి స్కంధ, విష్ణు, శక్తి ఈ మూడు తత్వాలనూ కలిగి ఉన్నది.

 సప్తర్షులకూ ఏడురూపాల్లో సాక్షాత్కరించిన సత్యస్వరూపుడు వేంకటేశ్వరుడు. ఇలా చాలానే ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ.. మనకున్న పద్దెనిమిది పురాణాలకుగాను 12 పురాణాల్లో శ్రీవారు విష్ణురూపమేనని చెబుతున్నాయి. కాబట్టి స్వామి నిస్సందేహంగా విష్ణురూపమే. అదీ సర్వదేవతా సమన్వయ స్వరూపం. అంటే ముక్కోటి దేవతలూ స్వామియందే ఉన్నారని అర్థం. ‘‘హరి అవతారములే అఖిలదేవతలు’’ అని అన్నమాచార్యులవారు చెప్పిందీ అదే కదా!

దేవునికి ఏ నూనెతో దీపం వెలిగించాలి?

భగవంతునికి ఆవు నెయ్యితో దీపం వెలిగించడం మంచిది. అది లేకపోతే నెయ్యిని ఉపయోగించవచ్చు. ఒకవేళ ఏ నెయ్యీ లేకపోతే నువ్వుల నూనెతో దీపం పెట్టడం శ్రేయస్కరం. అంత స్థోమత లేకపోతే ఆముదం నూనెతో వెలిగించవచ్చు. అయితే,నెయ్యి, నూనె కొనుగోలు చేసే స్థోమత లేకపోతే మనస్ఫూర్తిగా నమస్కరించి పూజ చేయొచ్చు.

తీర్థం మూడుసార్లు ఎందుకు తీసుకుంటారు?

ఆలయాల్లో దైవదర్శనం అనంతరం తీర్థాన్ని స్వీకరిస్తాం. ఆచార్యుల వారు మూడుసార్లు భక్తులకు తీర్థాన్ని ఇస్తారు. మొదటిసారి తీసుకునే తీర్థం శరీరశుద్ధికి, రెండో సారి ధర్మసాధనకు, మూడోసారి పరమపదం కోసమని పెద్దలు చెబుతారు. అనేక దేవాలయాల్లో రాగి పాత్రల్లో తీర్థాన్ని ఇస్తుంటారు.రాగిపాత్రలోని నీళ్లు అనేక రోగాలను నయం చేస్తాయి. నీళ్లలో కలిపే తులసి ఆకులతో పలు రుగ్మతలు నయమవుతాయి.

దేవుడికి టెంకాయ ఎందుకు కొట్టాలి?

పరంధాముడికి మనం ఇచ్చే నివేదన పవిత్రంగా వుండాలి. నిరంతరం మనల్ని రక్షించే భగవంతుడికి నిండైన మనస్సుతో ప్రార్థన చేయడం ఆ స్వామికి మనం చేసే సేవ. దేవునికి ప్రథమంగా టెంకాయనే నివేదనగా ఇస్తుంటారు. టెంకాయలోని నీరు పవిత్రమైనవి. ఎలాంటి కలుషితం లేకుండా తయారవుతాయి. వీటిలో ఎలాంటి కల్తీవుండదు. టెంకాయ పైభాగం పీచుగా, పెంకు గట్టిగా, లోపల తెల్లటి కొబ్బరి, నీళ్లు వుంటాయి. మనలోని అహాన్ని నిర్మూలించేందుకు టెంకాయను కొట్టాలని పెద్దలు చెబుతారు. ఇదే కాకుండా విఘ్ననాధుడైన వినాయకుడికి తొలి వందనంచేస్తాం. ఆయనకు ఇష్టమైన పదార్థాలను టెంకాయతోనే తయారుచేస్తారు. అందుకు ఆ స్వామికి ఇష్టానుగ్రహం కోసం టెంకాయను సమర్పిస్తాం. టెంకాయకు వున్న మూడుకళ్లు సాక్షాత్తు ఆ త్రినేత్రుడి నేత్రాలని భక్తులు విశ్వసిస్తారు. అందుకనే టెంకాయను మొదటగా దేవుడికి, ఏదైనా శుభకార్యం ముందు కొడుతుంటాం.

దేవుడి గదిలో దీపం ఎందుకు వెలిగించాలి?


భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంటిలోని దేవుని మందిరంలో దీపం వెలిగించాలి. కొందరు పొద్దున వెలిగిస్తే మరి కొందరు పొద్దున, సాయంత్రం కూడా వెలిగిస్తారు. కొన్ని గృహాల్లో అఖండదీపారాధన వుంటుంది. దీపంతో వెలుగు ఏర్పడుతుంది. చీకటిలో దీపం మనకు దారిని చూపించి ధైర్యాన్ని ఇస్తుంది. దీపమనేది ఒక జ్ఞానంలాంటిది. అజ్ఞానాన్ని, చీకట్లను పారదోలుతుంది. మనలోని అహాన్ని దీపపు వెలుగుల్లో ఆవిరి చేయాలి. దీపం ఎప్పుడూ పైకి వెలుగుతూ వుంటుంది. దీపశిఖ స్ఫూర్తిగా మనం కూడా జ్ఞానపు వెలుగులను అందుకుంటూ ఉన్నతశిఖరాలను అందుకోవాలన్నదే దీప పరమార్థం.

దీపాన్ని వెలిగించి ఈ శ్లోకాన్ని జపించాలి