Showing posts with label Maharastra temples. Show all posts
Showing posts with label Maharastra temples. Show all posts

సాయి సందేశం ‘సబ్‌కా మాలిక్‌ ఏక్‌’

సాయి సందేశం ‘సబ్‌కా మాలిక్‌ ఏక్‌’
సబ్‌కా మాలిక్‌ ఏక్‌ అన్న సందేశంతో యావత్‌ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్‌ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డిలో వుంది. ఫకీర్‌ అవతారంలోఅనేక మహిమలు ప్రదర్శించిన సాయినాధుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల నమ్మకం. సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది భక్తులు షిర్డికి వస్తుంటారు.
శ్రద్ధ, సబూరి
శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, సబూరి అంటే ఓర్పు, సాధన సందేశాలతో మానవాళికి అమూల్యమైన శాంతి సందేశాన్ని ఇచ్చారు. సాయినాధుడు ఎక్కడ జన్మించారు అన్న అంశంపై వేర్వేరు వాదనలు వున్నాయి. అహ్మద్‌నగర్‌ జిల్లాలోనే 19 శతాబ్దంలో జన్మించినట్టు కొందరు పర్బానీ జిల్లాలో జన్మించినట్టు మరికొందరు పేర్కొంటారు. అయితే ఈ వాదాలను పక్కనబెడితే హిందూ, ముస్లింల మధ్య సఖ్యతకు కృషి చేసిన మహనీయుల్లో ఆయన అగ్రగణ్యుడు. షిర్డిలోని పాత మసీదు మందిరాన్నే తన నివాసంగా చేసుకొని మత సామరస్యత కోసం శ్రమించారు. ఇప్పుడు ఆ మందిరాన్ని ద్వారకామాయిగా పిలుస్తున్నారు. సమాధి మందిరం పక్కన వున్న గురుస్థానంలో ఆయన కూర్చొనివుండేవారు. తొలిసారిగా 1854లో బాలసాయిని వీక్షించిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ధ్యానంలో వుండే సాయిని అనేక ప్రశ్నలు అడిగేవారు. అనంతరం ఆయన కొంతకాలం కనిపించలేదు.
ఆవో సాయి..
షిర్డి గ్రామంలోని ఖండోబా మందిరంలో మహాల్సాపతి పూజరిగా వుండేవారు. ఒకసారి సాయి ఆ గ్రామంలోకి తిరిగి ప్రవేశించారు. ఆయనను చూసిన మహల్సాపతి ఆవో సాయి అని ఆహ్వానించారు. దీంతో ఆయన నామం సాయిగా స్థిరపడింది. భగవుంతునికి ఎలాంటి పేర్లు వుండవు. భక్తులు ఏ పేరుతో పిలిస్తే పలుకుతారు అదే రీతిలో సాయిబాబాగా ప్రఖ్యాతిచెందారు. సాయి మహిమలను వీక్షించిన అనేక మంది ఆయన శిష్యులుగా మారారు. మహాల్సాపతి, శ్యామ, హరి సీతారాం, దామోదర్‌... తదితరులు ఆయన శిష్యగణంలో వుండేవారు. స్వామివారి మహిమలు దేశమంతటా వ్యాపించడంతో అనేకమంది భక్తులు షిర్డికి రావడం ప్రారంభించారు. 1918లో ఆయన సమాధి చెందారు. అయితే సమాధినుంచే భక్తులను అభయమిస్తుంటాను అన్న ఆయన దివ్యవ్యాఖ్యల ఫలితంగా షిర్డిక్షేత్రం భక్తజనక్షేత్రంగా మారిపోయింది.
సమాధిమందిర నిర్మాణం: బాబా భక్తులలో నాగ్‌పూర్‌కు చెందిన గోపాల్‌రావు బూటి ఒకరు. ఆయన కలలో స్వామి కనిపించి తనకు సమాధి మందిరాన్ని నిర్మించమని కోరారు. దీంతో బూటి ఆయనకు మందిరాన్ని నిర్మించారు. అదే మనం నేడు చూస్తున్న సమాధి మందిరం. షిర్డి ప్రవేశమే అన్ని పాపాలకు పరిహారం అన్న బాబా సూక్తికి అనుగుణంగా ప్రతిరోజు వేలాదిమంది భక్తులు సాయి సన్నిధానానికి వస్తుంటారు. మందిరప్రవేశంతోనే స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షిస్తూ దివ్యానుభూతి చెందుతారు. ద్వారకామాయితో పాటు చావడి, గురుస్థానం, నందదీప్‌, లెండి గార్డెన్స్‌... తదితర ప్రాంతాలను మనం చూడవచ్చు. ఈ ప్రదేశాల్లో సాయి నడియాడిన అంశం మనకు గుర్తుకు వస్తే మనస్సులో ఆధ్మాత్మిక భావం అలముకుంటుంది. సాయి సంస్థాన్‌ వారు బాబా వస్తువులతో ప్రత్యేకంగా ఒక ప్రదర్శనశాలను ఏర్పాటుచేశారు. వీటిని కూడా వీక్షించవచ్చు.
వసతి సౌకర్యం
* సంస్థాన్‌ వారు అనేక వసతి సముదాయాలను నిర్వహిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా ముందుగానే రిజర్వ్‌ చేసుకోవచ్చు,
* ప్రైవేటు వసతి గృహాలు ఎక్కువగా వున్నాయి. భక్తులు వారి ఆర్థిక స్థోమతకు తగినట్టుగా గదులను తీసుకోవచ్చు.
ఎలా చేరుకోవచ్చు
* దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి షిర్డికి రైలు, బస్సు సౌకర్యముంది.
* హైదరాబాద్‌ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌, సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌లు వున్నాయి.
* అజంతా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేవారు దిగివలసిన స్టేషన్‌ నాగర్‌సోల్‌. అక్కడ నుంచి షిర్డికి అనేక వాహనాలు వుంటాయి.
* సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళితే నేరుగా షిర్డి చేరుకోవచ్చు.
* షిర్డి సమీపంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
* ఔరంగాబాద్‌ విమానాశ్రయంలో దిగి వాహనాల ద్వారా షిర్డి చేరుకోవచ్చు.

లక్ష్మీదేవి క్షేత్రం /కొల్హాపూర్‌ [మహరాష్ట్ర]

లక్ష్మీదేవి క్షేత్రం



సకల సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. ఆమె కరుణ తమపై ప్రసరించాలని కోట్లాది భక్తులు నిత్యపూజలు చేస్తుంటారు. వైకుంఠంలో వున్న అమ్మవారు భక్తుల కోసం భూమిపై వెలసిన క్షేత్రమే మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని శ్రీమహాలక్ష్మీ ఆలయం. నిత్యం వేలాదిమంది భక్తులు ఆమెను దర్శించుకొని పునీతులవుతుంటారు. శక్తిపీఠంగా కూడా కొల్హాపూర్‌కు ఆధ్యాత్మిక ప్రాశస్త్యముంది.



వైకుంఠపురి నుంచి.. శ్రీమహావిష్ణువు వైకుంఠంలో వుండగా భృగుమహర్షి వచ్చాడు. అయితే రుషి రాకను విష్ణువు గమనించలేదు. దీంతో ఆగ్రహం చెందిన భృగువు స్వామివారి ఎదపై కాలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి భూలోకానికి వెళ్లి కొల్హాపూర్‌ సమీపంలో తపస్సులో మునిగిపోయింది. భృగువు పాదంలో కన్నును లౌక్యంగా తీసివేసిన మహావిష్ణువు రుషి గర్వాన్ని అణచివేశాడు. అనంతరం అమ్మవారి కోసం అన్వేషిస్తూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కొల్హాపురంలో వెలసిన అమ్మవారి ప్రాశస్త్యం అందరికి తెలియడంతో క్షేత్రం అందరికి దర్శనకేంద్రంగా మారింది.


ప్రళయంలోనూ చెక్కుచెదరదు.. ఈ ప్రాంతాన్ని కర్వీర్‌గా వ్యవహస్తారు. ఆ మహాదంపతులకు ఇష్టమైన ప్రదేశం కావడంతో మహాప్రళయంలోనూ చెక్కుచెదరదు. అందుకనే ఈ క్షేత్రాన్ని అవిముక్తేశ్వర క్షేత్రమని పేర్కొంటారు. లోకమాత జగదాంబ ఈ క్షేత్రాన్ని సృష్టించింది. అందుకనే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మహర్షులు, రుషులు పూజలు చేసినట్టు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. అమ్మవారి తపస్సు అనంతరం ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.
అరుదైన శిలపై అమ్మవారి రూపం
శ్రీమహాలక్ష్మీదేవి విగ్రహాన్ని అరుదైన శిలపై చెక్కారు. నాలుగు హస్తాలు కలిగి భక్తులను దీవిస్తున్న రూపం మనల్ని ఆకట్టుకుంటుంది. ఫలం, గద, కవచం, పాత్రను నాలుగుచేతుల్లో కలిగివున్న దివ్యమంగళరూపం భక్తులకు ఎల్లప్పుడూ ఆశీర్వచనాలు ఇస్తుంటుంది. అంబా బాయిగా ఆమెను భక్తులు ఆరాధనతో పిలుస్తారు. ఆలయంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. శక్తిపీఠాల్లో కూడా కొల్హాపూర్‌ ఒకటి కావడం విశేషం.


కిరణోత్సవం.. సూర్యదేవుడు అమ్మవారి కటాక్షం కోసం ఏటా మూడురోజులు గర్భాలయంలోకి సూర్యకిరణాలను ప్రసారిస్తాడు. తొలిరోజు పాదాలకు, రెండో రోజు నడుము భాగానికి మూడోరోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసారిస్తాయి. ఈ ఉత్సవాలను కిరణ్‌ ఉత్సవ్‌గా వ్యవహరిస్తారు. ఈ దినాల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వేలాదిమంది భక్తులు కొల్హాపూర్‌కు చేరుకుంటారు. క్షీరసాగర మథనంలో జన్మించిన శ్రీలక్ష్మీదేవిని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా స్వీకరిస్తారు. నారాయణిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మీదేవి ఎక్కడ వుంటే అక్కడ సిరిసంపదలకు లోటువుండదు. ఆమె కటాక్షం కోసం యావత్‌ మానవాళి ప్రార్థిస్తుంది. స్వయంగా ఆమె తపస్సు చేసి వెలసిన ప్రాంతమే కొల్హాపురం. అందుకనే ఆ నగరంలో పేదరికం వుండదని సామెత. సహకార ఉద్యమంలో కొల్హాపూర్‌ కీలకమైన భూమిక పోషించింది. చక్కెర మిల్లులు ఎక్కువగా వుండటంతో భారతదేశానికి చక్కెర కేంద్రంగా మారింది.


ఎలా చేరుకోవాలి
* దేశంలోని ప్రధాన నగరాలతో కొల్హాపూర్‌కు రోడ్డు, రైలు మార్గాలున్నాయి.
* హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో దూరం 540 కి.మీ.
* పుణె, ముంబాయి విమానాశ్రయాల నుంచి కొల్హాపూర్‌కు రోడ్డుమార్గాన చేరుకోవచ్చు.