కాశీదారాలకు విశిష్టత వుందా?

మనం అనేక ప్రముఖ యాత్రాక్షేత్రాల్లో కాశీదారం విక్రయించడం చూస్తుంటాం. అయితే ధర్మశాస్త్రాల్లో వీటిని కాశీతోరం అని వ్యవహరించారు. వీటిని మనం కంకణంలా కట్టుకుంటాం. ఈ దారాన్ని దేవతా పూజలో వుంచి అనంతరం కట్టుకోవడం మంచిది. తిరుమలలో ఎక్కువగా నలుపు, ఎరుపు దారాలు వుంటాయి. వీటిని కొనుగోలు చేసి సొంతవూర్లకు వచ్చిన అనంతరం బంధు మిత్రులకు ఇస్తుంటాం. ఇదొక సంప్రదాయంగా మారింది. దేవతామూర్తుల పాదాల వద్ద వుంచి అనంతరం వీటిని కట్టుకుంటే శ్రేయస్కరం. కొందరు ఒక పనిని తలపడితే అది పూర్తిచేసేవరకు విశ్రమించరు. ఇలాంటి వారినే మనం కంకణం కట్టుకొని పూర్తిచేశాడు అన్న సామెతను వాడుతాం. కంకణధారులు నిబద్ధత కలిగి వుండాలన్న అర్థం కూడా దీనిలో దాగివుంది. పసుపు, కాషాయం, ఎరుపు... తదితర రంగులు ఆయా దేవతల క్షేత్రాలకు సంబంధించినవి.