బ్రహ్మరాత, బ్రహ్మముడి, బ్రహ్మరథం, బ్రహ్మచెముడు, బ్రహ్మచారి, బ్రహ్మరాక్షసి, బ్రహ్మపుత్ర- ఈ పదాలలో ‘బ్రహ్మ’ శబ్దం ఉపయోగించడానికి కారణముందా?

బ్రహ్మ అంటే పెద్దది. పెద్దదిగా చేసేది. అంతటా వ్యాపించి ఉండేది. అంతటా వ్యాపించి ఉన్నా ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా ఉంటుంది. ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగాను ఉంటుంది. మన సంప్రదాయం, ఆచారం కూడా అంతటా వ్యాపించి ఉంటుంది. అన్నివేళలా అందరికీ రక్షణ కల్గిస్తుందని బోధించటమే బ్రహ్మశబ్ద ప్రయోగంలో అంతరార్థం. బ్రహ్మరాత జీవితాంతం, జీవనాలున్నంతవరకు ఉంటుంది కదా! ఇక బ్రహ్మముడి దంపతుల దాంపత్య బంధం. వారి జీవితాంతం ఉంటుంది. బ్రహ్మరథం అనేది మహానుభావులకు బ్రాహ్మణులు చేసే సత్కారం. ఆ అనుభూతి జీవితాంతం ఉంటుంది. దాని ఫలితం జన్మాంతరంలోనూ ఉంటుంది. బ్రహ్మచెముడు.. ఎంత పెద్దగా అరచినా వినపడదు. బ్రహ్మచర్యోపాసనే బ్రహ్మచారికి తరువాత జీవితమంతా ఫలిస్తుంది. లోకమంతా పూజిస్తుంది. బ్రహ్మరాక్షసి చాలా పెద్దదిగా గెలువజాలనిది. బ్రహ్మపుత్రులు సనకాదులు. మహాజ్ఞానులు. విశాలం, ఉన్నతం అనే విషయాలన్ని తెలుపటానికి అలా వాడతారు. మీరు బ్రహ్మవిద్యను మరిచారు. అదే ముక్తిని ప్రసాదిస్తుంది. ముక్తి పొందినవాడు బ్రహ్మ అంతటి వాడవుతాడు. అందుకే బ్రహ్మవిద్య బ్రహ్మపదం.