కొత్త ఇంట్లో పాలు ఎందుకు పొంగిస్తారు?

నూతనంగా నిర్మించిన గృహాల్లో చేరే సమయంలో కానీ ఇతర ఇళ్లలోకి ప్రవేశించే సమయంలో పొయ్యిపై పాలు పొంగించడం సంప్రదాయం. పాలు పొంగిన గృహాలు అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెబుతారు. దీని వెనక ఒక అర్థముంది. సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె సముద్ర గర్భం నుంచి జన్మించింది. నారాయణి హృదయేశ్వరుడు పాల సాగరమున పవళించిన శ్రీహరి. అందుకే పాలు పొంగితే అష్టైశ్వరాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత, ధనం, సంతానం, అభివృద్ధి వెల్లివిరుస్తాయని నమ్ముతారు. కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముందుగా ఆవును ప్రవేశపెట్టి తరువాత ఆ గృహ యజమాని లోపలికి ప్రవేశిస్తాడు. గోవు కామధేనువుకు ప్రతిరూపం. ఆవు తిరిగిన వారి ఇళ్లలో ఎలాంటి దోషాలు ఉండవు. కొత్త ఇంట్లోకి చేరే సమయంలో గృహ యజమాని ఇంటి ఆడపడుచులను పిలిచి ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో అన్నం వండి వాస్తుపురుషునికి సమర్పిస్తారు. ఈ పూజతో ఆ ఇంట్లో సుఖశాంతులకు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఇంత మంచి జరుగుతుంది కాబట్టే ఇంట్లో పాలు పొంగించడం నిర్వహిస్తారు. ఇంటి ఆడ‌ప‌డుచుల‌కు పెద్దపీట వేస్తారు. వదిన, ఆడపడచులకు మధ్య సఖ్యతకు ఇలాంటి కార్యక్రమాలు మరింత తోడ్పడుతాయి. దీంతో పాటు కొత్తగా గృహాన్ని నిర్మించిన అనంతరం ప్రవేశించే కార్యక్రమంలో బంధుమిత్రులను పిలుస్తాం. అందరితో ఆనందంగా గడుపుతాం. ఇలాంటి కార్యక్రమాలు అందర్ని ఒక్కచోటుకు చేర్చడంతో పాటు సాంఘిక సమైక్య జీవనాన్ని మరింత గాఢంగా చేసేందుకు ఉపయోగపడతాయి.