రామరాజ్యం ఆదర్శంగా ఎలా నిలిచింది?

సాక్షాత్తు వైకుంఠనాథుడు శ్రీ మహావిష్ణువు భూమిపై శ్రీరామచంద్రుడిగా జన్మించాడు. ప్రజాపాలన ఎలా చేయాలో స్వయంగా నిర్వహించి యావత్‌ విశ్వానికి ఆదర్శంగా నిలిచాడు. అందుకనే త్రేతాయుగం గడిచి వేల సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ రామరాజ్యం అని తలుచుకుంటాం. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో రామరాజ్య వర్ణన ఉంది. సర్వమంగళం

జగదభిరాముడు కోసల దేశాన్ని పాలించాడు. ఆయన పాలనలో గృహిణుల‌కు వైధవ్యం వుండేదికాదు. దొంగల భయం లేదు. అందరూ ఆరోగ్యవంతులుగా ఎటువంటి రోగాలు లేకుండా సుఖంగా జీవించేవారు. ప్రజలు, పాలకులు ధర్మబద్ధులై వుండేవాళ్లు. ఎలాంటి విరోధాలు లేకుండా అనురాగంగా నివసించే వాతావరణం వుండేది. వర్షాలు సకాలంలో కురిసేవి. ప్రజలు రాగ, ద్వేషాలకు అతీతంగా తమ వృత్తుల్లో రాణించేవారు. రామనామం తారకమంత్రంగా అందరూ జపించేవారు. రామచంద్రునితో సహా అందరూ సత్యాన్ని పలికేవాళ్లు. అసత్యాలు, దుర్వార్త ప్రచారం, పుకార్లకు ఆ నాటి సమాజంలో విలువ లేదు. చెట్లు నిత్యం పచ్చగా వుండటంతో చల్లటి వాతావరణం కనువిందు చేసేది. ధర్మ ప్రవర్తనతో అకాల మరణాలు వుండేవి కావు.

ఒక మానవుడు ప్రశాంతంగా, సంతృప్తిగా ఎలా జీవించాలో అందుకు అవసరమైన పరిస్థితులు రాముడు పాలించిన రాజ్యంలో ఉన్నాయి. అందుకనే ఆయన పాలించిన రాజ్యాన్ని రామరాజ్యం అంటారు. పాలకులు ప్రజలకు ఏం చెబుతారో ముందుగా ఆచరించి చూపాలి. అప్పుడే ప్రజానీకానికి మార్గదర్శిగా వుంటారు. దేశంలో యజ్ఞయాగాదులు నిత్యం నిర్వహించేవారు. ప్రకృతిని ఆరాధించేవారు. అందుకు తగినట్టుగా వర్షాలు కురిసేవి. పంటలు సకాలంలో వచ్చేవి. పాలకులతో పాటు ప్రజలు నీతి, ధర్మం తప్పలేదు. ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసి పాలించారు. అందుకనే రామరాజ్యం అని మన పెద్దలు చెబుతుంటారు.