జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటే...

మనదేశంలో చాలమంది తల్లులు పసిపిల్లలకు పాలు పట్టిన అనంతరం జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటుంటారు. ఇందుకు సంబంధించిన వృత్తాంతం పురాణగ్రంథాల్లో వుంది. పూర్వం వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులుండేవారు. వీరు మాయా రూప విద్యలు తెలిసినవారు. దారిన వెళ్లే బాటసారులను పిలిచి భోజనం పెట్టేవారు. భోజనానికి ముందు వాతాపిని ఇల్వలుడు మేకగా మార్చేవాడు. మేకను చంపి దానితో వంటలు తయారు చేసి అతిథులకు వడ్డించేవాడు. అనంతరం వాతాపిని బయటకు రమ్మని పిలిచేవాడు. కడుపులో వున్న వాతాపి వారి కడుపులను చీల్చుకొని బయటకు వచ్చేవాడు. దీంతో అతిథులు చనిపోయేవారు. ఇదే పద్దతిలో వాతాపి, ఇల్వలుడు అనేకమందిని పొట్టనబెట్టుకున్నారు. చనిపోయిన వారి నుంచి సంపదలను చోరీ చేసి దాచిపెట్టేవారు. ఇలా దోచుకున్న సంపదలు భారీగా పెరిగిపోయాయి. ఒక రోజున ఆ మార్గంలో అగస్త్య మహాముని వస్తున్నాడు. అతని గురించి తెలియని వారు తమ ఆతిథ్యం స్వీకరించమని కోరారు. అందుకు మహర్షి అంగీకరించాడు. భోజనం అనంతరం ఇల్వలుడు యథావిధిగా వాతాపి బయటకు రా అనబోయాడు. వీరి మాయోపాయాల్ని ముందుగానే పసిగట్టిన అగస్త్యుడు తన కడుపును నిమురుకుంటూ ‘‘ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’’ అన్నాడు. దీంతో మహర్షి వాక్కుతో వాతాపి జీర్ణమయిపోయాడు. మహర్షి మహిమకు భీతిల్లిన ఇల్వలుడు శరణుకోరాడు. ఇలా అనేకమంది అమాయకులను కబళించిన రాక్షసుల బెడదను అగస్త్య మహాముని తొలగించాడు. అందుకనే మన పెద్దలు అప్పుడప్పుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటారు.