‘కలౌ వేంకటనాయకా’ అంటే అర్థమేమి?

నాలుగు యుగాల్లో కలియుగంలో పాపాలు ఎక్కువగా వుంటాయి. ఎందుకంటే ధర్మం ఒక్క పాదంతో నడుస్తుంటుంది. కలిపురుషుని ప్రభావంతో అనేక చిత్ర విచిత్రమైన సంఘటనలు సంభవిస్తుంటాయి. మానవులు ధర్మబాటలో నడవకుండా అధర్మప్రచారానికి ప్రభావితమవుతారు. కలియుగంలో మనకు అండగా వుండేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏడుకొండలపై శ్రీ వేంకటేశ్వరస్వామిగా అవతరించారు. స్వామిని స్మరిస్తేనే పాపాల నుంచి విముక్తి కలిగిస్తాడు. కలియుగ ప్రత్యక్షదైవంగా వుంటూ భక్తుల పాపాలను తొలగిస్తున్న స్వామిని ‘కలౌ వేంకటనాయకా’ అని పిలుస్తారు. ‘సర్వపాపాని వేం ప్రాహుః కట స్తద్దాహ ఉచ్యతే ’ భవిష్యత్‌పురాణంలో ఇలా పేర్కొన్నారు. అన్ని పాపాలను ‘వేం’ అని అంటారు. కట అంటే తొలగించడం. వేంకట అంటే మన పాపాలను దహించేవాడు. అందుకనే ఆ నారాయణుడిని కలౌ వేంకటనాయకా అని భక్తితో కొలుస్తాము. ‘‘ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే, రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌’’ఈ మంగళశాసనం వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూమండలంలోని తిరునగరిలోని పుష్కరిణిలో విహరించడానికి విచ్చేశారని వెల్లడిస్తోంది. తన భక్తులను స్వయంగా పరిరక్షించేందుకే స్వామివారు వైకుంఠం నుంచి వచ్చి ఆదివ‌రాహ‌ స్వామి వద్ద అనుమతి పొంది నివాసముంటున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయంగా వెలిశారు కనుకనే ఈ తిరుక్షేత్రం లక్షలాది భక్తుల రాకతో దివ్యారామంగా విరాజిల్లుతోంది.