గణపతికి ఏకదంతమే ఎందుకుంటుంది?

విఘ్నాలను తొలగించేవాడు విఘ్నేశ్వరుడు అందుకనే ఆయనకు మనం తొలిపూజ చేసిన అనంతరమే శుభకార్యాలను ప్రారంభిస్తాం. గణనాధుడికి ఏకదంతమే వుండటం విశేషం. అందుకే స్వామిని ఏకదంతాయ నమః అని పూజిస్తాం. ఆ జగన్మాత పార్వతీదేవి తనయుడైన వినాయకునికి ఏకదంతుడు అని పేరు రావడం వెనుక ఒక కథ వుంది. బ్రహ్మవైవర్త పురాణంలో గణేశ ఖండంలో స్వామికి ఏకదంతం ఎలా ఏర్పడింది అన్న అంశంపై వివరాలున్నాయి. ఒకసారి పరశురాముడు ఆదిదంపతుల దర్శనార్థం కైలాసానికి వస్తాడు. అయితే వారు ఏకాంతంలో వున్నారని భంగం కలిగించకూడదని వినాయకుడు అతనిని వారిస్తాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగుతుంది. గణేశుడు ఎంత సౌమ్యంగా చెప్పినప్పటికీ పరశురాముడు గండ్రగొడ్డలిని విసరబోయే యత్నం చేస్తాడు. ఇంతలో కార్తికేయుడు ప్రవేశించి గురుపుత్రుడిపై ఆగ్రహం వ్యక్తంచేయడం సబబుకాదని హితవు పలికాడు. అయినా పరశురాముడు గొడ్డలి విసిరేందుకు సిద్ధమవుతాడు. దీంతో వినాయకుడు తన తొండాన్ని కొన్ని వందల యోజనాలు పెంచి పరశురాముడిని పట్టుకొని గిరగిరా తిప్పాడు. ఒకసారి ఎత్తుకొని పద్నాలుగు లోకాలను చూపిస్తూ తొండంతో తిప్పాడు. దీంతో భార్గవరాముడు భీతిచెందాడు. అనంతరం సముద్రాల నీటిని తొండంతో పీల్చివేసిన గణపతి ఒక్కసారిగా అన్నింటిని వెదజల్లి పరశురాముడిని అందులోకి విసిరివేశాడు. సాగరంలో పడ్డ జమదగ్ని పుత్రుడు వెంటనే ఈదుకుంటూ బయటకు వచ్చి పట్టరాని ఆగ్రహంతో గొడ్డలిని విసిరాడు. ఆ పరశువు వేగంగా వెళ్లి వినాయకుడి ఒక దంతాన్ని నరికి తిరిగి అతన్ని చేరుకుంది. ఈ గొడవకు పరమేశ్వరుడు, పార్వతీలు బయటకు వచ్చారు. తన ముద్దుల తనయుడికి ఒక దంతం లేకపోవడం గమనించిన జగన్మాత ఏం జరిగిందని మురుగన్‌ను అడుగుతుంది. అతను మొత్తం సంఘటనా వివరాలను తెలపడంతో అమ్మ ఉగ్రరూపం దాల్చి పరశురాముడిని శపించేందుకు సిద్ధమవుతుంది. పరశురాముడు తనను క్షమించమని అమ్మను వేడుకోవడంతో ఆమె శాంతిస్తుంది. అతను కూడా తన తనయుడి లాంటి వాడే కాబట్టి జగన్మాత అతన్ని క్షమించింది. ఒక దంతం అలా పోవడంతో స్వామి ఏకదంతుడిగా పేరుపొందారు. నిత్యం పూజలందుకుంటూ యావత్‌ విశ్వాన్ని పరిరక్షిస్తున్నారు.