శివ, కేశవులకు కార్తీకం పవిత్రమైనదా?

చంద్రుడు కృతికానక్షత్రంలో ప్రవేశించిన రోజు నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసమిది. లింగమూర్తి పట్ల బుద్ధిని నిలిపి ధ్యానం చేయడానికి అనుకూలమైన సమయం ఈ మాసంలోనే వస్తుంది. మానవ జీవితానికి మోక్షం కీలకం. ఈ మోక్షాన్ని సాధించడానికి జ్ఞానం కలిగివుండాలి. జ్ఞానం కలగాలంటే ధ్యాన సాధన చేయాలి. అందుకనే ప్రశాంతమైన ఈ మాసాన్ని ధ్యానానికి అనుకూలంగా చెబుతారు. ఈ మాసంలో వచ్చే పున్నమి వెన్నెల కాంతులు వెద‌జ‌ల్లుతుంది. వెన్నెల మహాశివుని దేహంపై ప్రసరించి భూమిపైకి రాలడాన్ని విభూతిగా అభివర్ణిస్తారు. అభిషేకప్రియః శివః అంటే పరమేశ్వరుడు అభిషేకప్రియుడు. నిర్మలమైన మనస్సుతో శివలింగానికి అభిషేకం జరిపిస్తే ఆ కరుణామూర్తి అన్ని బాధలను తొలగిస్తాడు. తులసీదళాలతో శ్రీ మహావిష్ణువును పూజించాలి. విష్ణుమూర్తిని దామోదరుడని ఈ నెలలో పిలుస్తారు. కార్తీకంలోనే అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభమవుతాయి. దీపావళి వెళ్లిన అనంతరం వచ్చే చవితి రోజున నాగుల చవితి జరుపుకొంటారు. ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి వైకుంఠంలో శ్రీలక్ష్మీ సమేతుడై శయనిస్తాడు. కార్తీకశుద్ధ ఏకాదశితో చాతుర్మాస్య వ్రతం ముగుస్తుంది. కార్తీక సోమవారాలు శివుడిని మారేడు దళాలతో పూజించాలి. ఈ మాసంలో వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మానవుడు సంఘజీవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సామూహికంగా ఒక కార్యక్రమం ద్వారా అందరూ సమావేశమవుతారు. కార్తీకంలో దీపారాధనకు విశిష్టమైన ప్రాధాన్యం వుంది. దీపం చీకట్లను పారదోలుతుంది. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం మంచిది. దృష్టిదోషాలను కూడా దీపం పోగొడుతుంది. ఆధ్యాత్మికపరంగా, ఆరోగ్యపరంగా కార్తీక మాసం విశిష్టమైనది. అందుకనే శివ, కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా దీన్ని పేర్కొంటారు.