పిడుగులు పడే సమయంలో అర్జునా, ఫల్గుణా అని ప్రార్థించాలా?

భారీవర్ష సమయంలో పిడుగులు కూడా పడుతుంటాయి. ఇవి ఎక్కువగా చెట్లపైన పడటం గమనిస్తాం. పిడుగు పడేటప్పుడు పెద్దశబ్ధం వస్తుంది. ఇంట్లో పిల్లలు ఈ శబ్ధాన్ని విని భయపడుతారు. పిల్లలతో పాటు పెద్దలకు భయాన్ని దూరం చేసేందుకు అర్జునా,ఫల్గుణా అని పదినామాలను జపిస్తాం. మహాభారతంలో అజ్ఞాతవాసం ముగిసిన సమయంలో కౌరవులు విరాటరాజుకు చెందిన గోవులను అపహరిస్తారు.

 దీంతో విరాటరాజు కుమారుడైన ఉత్తరుడు వాటిని తీసుకువచ్చేందుకు బృహన్నల (అర్జునుడు) రథాన్ని నడుపుతుండగా యుద్ధానికి బయలుదేరుతాడు. అదే సమయంలో అజ్ఞాతవాసం ముగియడంతో అర్జునుడు తన యథారూపాన్ని దాల్చుతాడు.శత్రు సేనలు చూసిన ఉత్తరుడు భయంతో పారిపోగా అతనికి అర్జునుడు నచ్చజెప్పి తాము దాచిన ఆయుధాల ప్రాంతానికి వెళుతారు.

 శమీవృక్షంపై ఆయుధాలను చూసిన ఉత్తరునికి అవి సర్పరూపాలుగా కనిపిస్తాయి. దీంతో అర్జునుడు తన పదినామాలైన అర్జునా,ఫల్గుణా, బీభత్స, కిరీటీ, సవ్యసాచి, కృష్ణ, ధనంజయ, శ్వేతవాహన, విజయ,పార్థ అని జపించమంటాడు. దీంతో ఉత్తరునికి భయం తొలగి ఆయుధాలను చెట్టుపై నుంచి కిందకు తీసుకువస్తాడు. భయాన్ని పొగొట్టే మంత్రంగా దీనిని పెద్దలు చెబుతారు.