కంచి బంగారు, వెండి బల్లుల విశిష్టతను వివరించండి?

బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. అయితే ఇవి పైన పడితే దోషనివారణకు కంచి క్షేత్రం వరదరాజపెరుమాళ్‌ ఆలయంలోని బంగారుబల్లి, వెండి బల్లిని తాకాలి. వీటిని తాకితే ఆ దోషాలు వెళ్లిపోతాయని పెద్దలు చెబుతారు. దీనికి సంబంధించిన పురాణగాథ‌ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు.
 నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్‌ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లుల‌ రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది.
 ఈ సమయంలో సూర్య, చంద్రులు సాక్ష్యులుగా ఉన్న బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్‌ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా వ్యాప్తిలో వుంది.